 
													
పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
క్షేత్రస్థాయిలో పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గనున్న ధర
పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
తగ్గింపు ధరలు నేటి నుంచే అమల్లోకి
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ తగ్గింపు దోహదపడుతుందని అన్నారు.
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిపోతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.9.5, డీజిల్ ధర రూ.7 చొప్పున తగ్గుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.లక్ష కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.6,100 కోట్ల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్æ డ్యూటీ తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది.  ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ రూ.96.67 పలుకుతోంది. కేంద్ర పన్నుల తగ్గింపుతో ఆదివారం ఈ ధరలు వరుసగా రూ.95.92, రూ.89.67కు పడిపోనున్నాయి. పీఎం ఉజ్వల యోజన కింద ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,003 ఉంది. రూ.200 రాయితీతో రూ.803కే పొందవచ్చు. పెట్రో, వంట గ్యాస్ ధరల భారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
ప్లాస్లిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కోసం మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే దిగుమతి చేసుకొనే ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల మన దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా ఇనుము, ఉక్కు ధరలను సైతం తగ్గించడానికి వీలుగా ఆయా ముడి సరుకులపై కస్టమ్స్ పన్ను తగ్గించనున్నట్లు వెల్లడించారు.
ఉక్కుకు సంబంధించి కొన్ని ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించబోతున్నట్లు తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా సిమెంట్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు నిర్మల ప్రకటించారు. సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కాగా, స్టేట్ ట్యాక్స్ లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పాక్షికంగానే తగ్గించిందని  విమర్శించింది
 
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
— ANI (@ANI) May 21, 2022
(File Pic) pic.twitter.com/13YJTpDGIf
ప్రజలే మాకు ప్రథమం: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రథమం అని ప్రధాని  మోదీ చెప్పారు. ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో ఆయన శనివారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు.
ఎరువులపై అదనంగా రూ.1.10 లక్షల కోట్ల రాయితీ
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పునద్ఘాటించారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే తమ హయాంలో సగటు ద్రవ్యోల్బణం గత ప్రభుత్వాల కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మన దేశంలో సరుకుల ధరలను అదుపులో ఉంచామని గుర్తుచేశారు. ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని, ఈ భారం మన రైతులపై పడకుండా ఎరువులపై సబ్సిడీకి రూ.105 లక్షల కోట్లకు అదనంగా రూ.1.10 లక్షల కోట్లు కేటాయించామన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
