పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం! | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!

Published Fri, Dec 29 2023 5:06 AM

Govt considering reduction in prices of petrol, diesel soon - Sakshi

న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్‌ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్‌ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో రిటైల్‌ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్‌ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 , లీటర్‌ డీజిల్‌ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement