Meghalaya: సీఎం నివాసంపై పెట్రో బాంబు దాడి

Petrol Bomb Hurled at Meghalaya CM Conrad Sangma Residence - Sakshi

మేఘాలయలో ఉద్రిక్త​పరిస్థితులు

రాజీనామా చేసిన హోం మంత్రి లక్మెన్ రైంబుయ్

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్‌కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. 

ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్‌టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా.. రెండవది పెరడు వెనుకకు విసిరివేశారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. 

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటలనకు బాధ్యత వహిస్తూ.. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు.

ఘర్షణలకు కారణం ఏంటంటే..
2018 లో లొంగిపోయిన చెస్టర్‌ఫీల్డ్ థాంగ్‌కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. అయితే థాంగ్‌కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్‌కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్‌నెట్‌ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు.

ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top