పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2022.. అప్‌డేట్స్‌

Parliament Winter Session 2022 Live Updates - Sakshi

03:400PM
సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంటులో రగడ మొదలైంది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆందోళన చేపట్టారు. సింగరేణిలో కేంద్రం వాటాను బీజేపీ అమ్మేస్తుందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటామని అడిగినా.. తమ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సింగరేణిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి ఓనర్‌షిప్‌ ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 51 శౠతం ఓనర్‌ షిప్‌ ఉందన్నారు. ఆక్షన్‌ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పారదర్శకంగా ఆక్షన్‌ వేస్తున్నానమని పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్‌కు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. అన్ని రాష్టట్రాల ప్రభుత్వాలు కూడా తమకు సహకరిస్తున్నాయని, ఆక్షన్‌ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందన్నారు.

03:00PM
పార్ల‌మెంట్‌లోని విప‌క్ష పార్టీల‌ అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోంద‌ని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఆరోపించారు. లోక్‌స‌భ‌లో ఆయన మాట్లాడుతూ.. లోక్‌స‌భ‌లోని స్థాయి సంఘం చైర్మెన్ ప‌దవుల‌ను విప‌క్షాల నుంచి ప్ర‌భుత్వం లాక్కుంటోంద‌ని అన్నారు. త‌మ వ‌ద్ద ఉన్న ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మెన్ ప‌ద‌విని ప్ర‌భుత్వం గుంజుకున్న‌ట్లు అధిర్ ఆరోపించారు.  పార్ల‌మెంట్‌లో విప‌క్షాలకు ఎటువంటి అధికారం ద‌క్క‌కుండా చూస్తున్నార‌ని అధిర్ విమ‌ర్శించారు.

అక్టోబరులో క్యాబినెట్ ఆమోదించిన మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై గల సమస్యను కూడా అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భూభాగాన్ని ఆక్రమిస్తోందని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని. ఇది స్వయంప్రతిపత్తి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

02:00PM
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాద సమస్యను లేవనెత్తారు. “కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. కర్ణాటకలో మహారాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.  ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని, మహారాష్ట్రపై కర్ణాటక చేస్తున్న దాడిని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు.

12:50PM
లోక్‌సభ తిరిగి ప్రారంభమైన క్రమంలో జీరో అవర్‌లో అత్యవసర ప్రజా సమస్యలపై చర్చ చేపట్టారు సభ్యులు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్‌ ఓం బిర్లా. మరోవైపు.. రాజ్యసభలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు అభినందనల తీర్మానంపై మాట్లాడుతున్నారు. 

11:20AM
సూపర్‌స్టార్‌కు సంతాపం
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపట్ల లోక్‌సభ సంతాపం తెలిపింది. సంతాప సందేశం చదివిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు స్పీకర్‌. 

ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు
ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు స్వీకరించిన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్‌ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారారన్నారు.  

11:00AM
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యులను కోరారు ప్రధాని మోదీ. 

అన్ని పార్టీలు చర్చకు విలువనిస్తాయని విశ్వసిస్తున్నా: మోదీ
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ఆగస్టు 15, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. అలాగే.. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం లభించిన క్రమంలో జరుగుతున్న సమావేశాలని పేర్కొన్నారు. 

‘గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్‌ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చలకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. 

► సంస్మరణ ప్రకటన తర్వాత లోక్‌సభ గంటపాటు వాయిదా పడనుంది. అయితే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరీ మాత్రం సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సంస్మరణార్థం ఒక పూట వాయిదా వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

► పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2022 మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 

► పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఎంసీ సైతం పాల్గొంది. 

► ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి జరిగిన ఘటనపై చర్చించాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్‌ ఎంపీ మానికం ఠాగూర్‌. 

► విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. 

► దేశవ్యాప్తంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, ఎగసిన ధరలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ సాక్షిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సంసిద్ధమవుతున్నాయి.

► 29వ తేదీ వరకు అంటే 23 రోజుల్లో 17 సిట్టింగ్‌లలో ఈసారి సెషన్‌ కొనసాగనుంది.

► ఈసారి సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

► పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన మరుసటి రోజే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆ ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది.

► అయితే.. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్లలో బిజెపి తిరిగే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ ఉత్సాహంగా ఉంది.

► పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు పెరుగుతున్న జీఎస్టీ పనులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ 

► దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలతో కలిసి అంశాలపై పోరాడతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు.    

► ఇక ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించించింది ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 

నిలదీసే లక్ష్యంతో కాంగ్రెస్‌
చైనా సరిహద్దు వెంట పరిస్థితులు, కేంద్ర ఎన్నికల సంఘంలో ఆకస్మిక నియామకాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్, పైపైకి పోతున్న ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది.  భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించింది ఆ పార్టీ.

ఈసారి 16 బిల్లులు
బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్, నటుడు ఘట్టమనేని కృష్ణ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తదితరులకు ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.  

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై..
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్‌చేయాలంటూ రూపొందించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని బంధోపాధ్యాయ్‌ కోరారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన భేటీలో బంధోపాధ్యాయ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఏపీ విభజన అంశాలే ప్రధాన ఎజెండా: వైఎస్‌ఆర్‌సీపీ
పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న జీఎస్టీ పన్నులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని, విపక్షాలతో కలిసి అన్ని అంశాలపై పోరాడతామని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. మరోవైపు.. ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  

ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top