మళ్లీ సరిహద్దు రగడ 

Maharashtra Karnataka Border Dispute: High Tension Continue At Belgaum - Sakshi

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉద్రిక్తత  

బెళగావిలో పోటాపోటీగా నిరసనలు  

వాహనాలపై పరస్పరం దాడులు  

సరిహద్దులను కాపాడుకుంటామన్న సీఎం బొమ్మై  

తమ సహనాన్ని పరీక్షించవద్దని శరద్‌ పవార్‌ హెచ్చరిక  

బెంగళూరు/ముంబై/బెళగావి: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తంగా మారుతోంది. బెళగావి నగరంలో మంగళవారం ఇరు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలపై పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకితీసుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు, నేతలు తలపెట్టిన బెళగావి పర్యటనను నిరసిస్తూ కన్నడ సంఘాల సభ్యులు రోడ్లపైకి వచ్చారు.

ప్లకార్డులు, బ్యానర్లు, పోస్టర్లు, కన్నడ జెండాలను ప్రదర్శిస్తూ మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెళగావిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటి నెంబర్‌ ప్లేట్లపై నల్లరంగు పూశారు. కన్నడ సంఘాల నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ‘కర్ణాటక రక్షణ వేదిక’ ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్, శంభూరాజ్‌ దేశాయ్‌ మంగళవారం బెళగావిలో పర్యటించి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి  సభ్యులకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. కొన్ని కారణాలతో వారి పర్యటన వాయిదా పడింది. శివసేన నాయకులు కూడా బెళగావి పర్యటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బెళగావి జిల్లా కలెక్టర్‌ నగరంలో ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని పుణేలో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం శివసేన కార్యకర్తలు కర్ణాటక వాహనాలపై రంగు చల్లారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.  

కన్నడిగుల ప్రయోజనాలు కాపాడుతాం: సీఎం బొమ్మై  
మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కోరారు. కన్నడిగులు ఎక్కడున్నా సరే వారి ప్రయోజాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయ పోరాటంలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.   

24 గంటల్లోగా దాడులు ఆపాలి: పవార్‌ 
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై కారణమని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్ర సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులను 24 గంటల్లోగా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతిభద్రతలు దిగజారాయని, ఇందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. తమ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నా కేంద్రం, మహారాష్ట్ర సర్కారు నోరుమెదపడం లేదని పవార్‌ మండిపడ్డారు. బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆక్షేపించారు.  

మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు.   

ఏమిటీ వివాదం?  
రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top