Pakistan: జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు.. పలువురు సైనికులు మృతి | Pakistan: Baloch Liberation Army Bombs Jaffar Express Train in Balochistan, Several Injured | Sakshi
Sakshi News home page

Pakistan: జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు.. పలువురు సైనికులు మృతి

Oct 7 2025 1:29 PM | Updated on Oct 7 2025 1:37 PM

Pakistan Train Headed To Balochistan Targeted Again

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ..  జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. సింధ్‌-బలూచిస్థాన్‌ సమీపంలోని సుల్తాన్‌కోట్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి.. పట్టాలను పేల్చివేసింది. ఆ సమయంలో క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

బాధ్యత వహించిన బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ
పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్ల బృందమైన బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాద సమయంలో పాక్‌ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నారని సమాచారం. పేలుడు దాటికి పలువురు సైనికులు మృతిచెందినట్లు, చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇచ్చేంత వరకూ ఇలాంటి దాడులను కొనసాగిస్తామని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది.
 

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారికి చికిత్స  అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనలో ఎందరు ప్రాణాలు కోల్పోయారన్న దానిపై వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

తరచూ ఇదే ఎక్స్‌ప్రెస్‌పై దాడి
జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి. గత మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు.  వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ సైనికులను హతమార్చారు. ఆ తరువాత పాక్‌ ఆర్మీ  రంగంలోకి దిగి, బందీలను విడిపించింది.  ఇదేవిధంగా జూన్‌లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని, బలోచ్‌ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో పాక్‌ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్‌ గ్రూప్‌ తరచూ దాడులకు పాల్పడుతుండటం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement