‘ఐపీఎల్‌ ఫ్లడ్‌లైట్లను హ్యాక్‌ చేశాం’ | Pak Defence Ministers Bizarre Claim Goes Viral | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌ ఫ్లడ్‌లైట్లను హ్యాక్‌ చేశాం’

Jun 16 2025 7:38 PM | Updated on Jun 16 2025 9:42 PM

Pak Defence Ministers Bizarre Claim Goes Viral

న్యూఢిల్లీ:  భారత్‌లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ అభాసుపాలయ్యారు పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్‌. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్‌ చేశామని చెప్పుకున్న ఖవాజా అసిఫ్‌.. ఈసారి  ఐపీఎల్‌ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఫ్లడ్‌లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్‌ చేశామని పాక్‌ అసెంబ్లీ(పార్లమెంట్‌) సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు.  మే 8వ తేదీన పంజాబ్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఫ్లడ్‌లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్‌ చేశారన్నారు. 

అసలు పాకిస్తాన్‌లో ఇంత టెక్నాలజీ ఉందా అనే భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘మీరు హ్యాక్‌ చేయడానికి ఫ్లడ్‌లైట్లు ఏమీ వైఫై కనెక్షన్‌ మీద నడవలేదు. కట్టుదిట్టమైన ఎలక్రికల్‌ సిస్టమ్‌లో నడిచాయి.  ఇప్పుడు పాకిస్తాన్‌లో సైబర్‌ సబ్జెక్ట్‌ఃను ఏమైనా ప్రవేశపెట్టారా? అని సెటైర్‌ వేయగా,  ‘మీరు స్కూలింగ్‌ ఎక్కడ చదివారో.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని భలే చెబుతున్నారు’ అంటూ మరో నెటిజన్‌ రిప్లై ఇచ్చాడు

‘ఈసారి ఒక పని చేయండి.. ఫ్లడ్‌లైట్లను కాదు.. స్కోరు బోర్డును హ్యాక్‌ చేయండి’ అంటూ మరొక యూజర్‌ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇలా పాకిస్తాన్‌ రక్షణమంత్రిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్‌ ఇలా దొరికిపోవడం తొలిసారి కాదు.. గతంలో ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా తాము భారత్‌ జెట్‌ విమానాలను కూల్చివేశామని, దానికి సోషల్‌ మీడియానే సాక్షి అంటూ AI క్రియేట్‌ చేసిన వీడియోలు గురించి మాట్లాడారు.  ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు ఖవాజా అసిఫ్‌.

 

Advertisement
 
Advertisement
Advertisement