నూపుర్‌ వ్యవహారం: బీజేపీ సీరియస్‌ వార్నింగ్‌! ఇకపై ఆచితూచి..

Nupur Sharma Crisis: BJP New Rules For Spokespersons TV Debates - Sakshi

న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్‌లో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యల తాలుకా ప్రభావం.. బీజేపీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దేశంలో రాజకీయ విమర్శలు ఎదురుకాగా..  ముఖ్యంగా ఇస్లాం దేశాల అభ్యంతరాలతో వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. 

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. 

అంతేకాదు.. టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్‌లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. 

తాజా రూల్స్‌ ప్రకారం.. టీవీ డిబేట్‌లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. ఓ టీవీ డిబేట్‌లో వ్యాఖ్యలు చేసినందుకే నూపుర్‌ శర్మపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆమెను పార్టీని నుంచి సస్పెండ్‌ చేసింది బీజేపీ. అదే విధంగా.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు మరో నేత నవీన్‌ కుమార్‌ జిందాల్‌ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ​ఖతర్‌, కువైట్‌, యూఏఈ, పాకిస్థాన్‌, మాల్దీవ్‌, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్‌ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

చదవండి: అలా చేయకుంటే.. నూపుర్‌ శర్మ అంతుచూస్తాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top