
నాన్ బ్యాంక్‌లకు కనీస నెట్‌వర్త్
కొత్త మార్గదర్శకాలు విడుదల
ముంబై: చెల్లింపుల సేవలకు మధ్యవర్తులుగా వ్యవహరించే అగ్రిగేటర్లను (పేమెంట్ అగ్రిగేటర్లు) మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ, ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇందులో భౌతికంగా సేవలు అందించే (పీవోఎస్ మెషీన్ల ద్వారా) వాటిని పీఏ–పీగా, సీమాంతర చెల్లింపుల్లోని వాటిని పీఏ–సీబీలుగా, ఆన్‌లైన్ చెల్లింపుల సేవల అగ్రిగేటర్లను ఆన్‌లైన్ పీఏలుగా వర్గీకరించింది.
పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార నిర్వహణ విషయమై బ్యాంక్‌లకు ఎలాంటి అనుమతి అక్కర్లేదు. నాన్ బ్యాంక్‌లకు మాత్రం నిర్ణీత మూలధనం అవసరమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారం ప్రారంభించాలనుకునే సంస్థ దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం రూ.15 కోట్ల నెట్‌వర్త్ (నికర విలువ) కలిగి ఉండాలి. అనుమతి పొందిన మూడో ఏడాదికి రూ.25 కోట్ల నెట్‌వర్త్‌ను సాధించాల్సి ఉంటుంది’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.