
ఇంజనీరింగ్ ఫీజులపై నేటి నుంచి కసరత్తు
ఎఫ్‌ఆర్‌సీ ముందుకు ప్రైవేటు కాలేజీలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం పరిశీలన
జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులపై దృష్టి
ఎఫ్‌ఆర్‌సీ ఆడిటర్లను మార్చే యోచన
మరోవైపు ప్రైవేటు కాలేజీల అంతర్మథనం
వచ్చేవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) సోమవారం నుంచి తిరిగి పరిశీలించనుంది. అన్ని డాక్యుమెంట్లతో హాజరవ్వాలని ఇప్పటికే 180 కాలేజీలకు నోటీసులు పంపింది. తొలి రోజు 20 కాలేజీలతో చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీ వర కు కొనసాగుతుంది. 2025–28 బ్లాక్ పీరియడ్‌కు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆరు నెలల క్రితమే మొదలైంది.
కాలేజీల డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోర్టులను కమిటీ పరిశీలించింది. కాలేజీలతో చర్చించి ప్రతిపాదిత ఫీజులతో నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అందుకు అంగీకరించకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వే సింది. ఈ కమిటీ సూచనల మేరకు కాలేజీల ఫీజుల వ్యవహారాన్ని మరోసారి ఎఫ్‌ఆర్‌సీ విచారిస్తోంది.
ప్రైవేటు కాలేజీలకు టెన్షన్
కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలను కొత్తగా మార్గదర్శకాలుగా తీసుకుంటున్నారు. ఇందుకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు ఉన్న కాలేజీలను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై కాలేజీ యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. కొన్ని కాలేజీలకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు ఉన్నా గతంలో ఎప్పుడూ ఫీజుల పెంపునకు వీటిని కొలమానంగా తీసుకోలేదు.
ఈ ర్యాంకులు లేకున్నా, తక్కువ స్థాయిలో ఉన్నా నిర్ణీత ఫీజుకు కత్తెర కూడా వేసే అవకాశం ఉందని యాజమాన్యాలు భయపడుతున్నాయి. కొన్ని కాలేజీలు న్యాక్ ర్యాంకు కోసం కూడా ప్రయత్నించలేదు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు టాప్ కాలేజీలకు మాత్రమే వస్తున్నాయని యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద కాలేజీలకే న్యా యం జరుగుతుందని, చిన్న కాలేజీలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఆడిట్ లెక్కలపై సందేహాలు
గత మూడేళ్ల జమా ఖర్చులను కాలేజీలు ఎఫ్‌ఆర్‌సీకి ఇప్పటికే సమర్పించాయి. వీటిని ఆడిట్ విభాగాలు పరిశీలించాయి. అయితే, కాలేజీల్లో ఆడిట్ చేసినవారితో ఎఫ్‌ఆర్‌సీ ఆడిటర్లకు సంబంధాలున్నాయని, ఇప్పుడు వారిని మార్చే అవకా శం ఉందని చెబుతున్నారు. మౌలిక వసతులకు చే సిన ఖర్చు, ఫ్యాకల్టీకి చెల్లించిన వేతనాలు డిజిటల్ విధానంలో చూపించా లని ఎఫ్‌ఆర్‌సీ కోరే అవ కాశం ఉంది.
అయితే దాదా పు 85 కాలేజీల వద్ద ఇలాంటి ఆధారాలు లేవని సమాచారం. దీంతో ఈ కాలేజీల ఫీజుల్లో కోత పడుతుందా? అనే సందేహాలు యాజమాన్యాల్లో కలుగుతున్నాయి. లే»ొరేటరీ లు, ప్లేస్‌మెంట్లను కూడా ఫీజుల పెంపునకు కొల మానంగా తీసుకోబోతున్నారని తెలిసింది.
అయితే, కొన్నేళ్లుగా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఆఫ్ క్యాంపస్ నియామకాలే జరుగుతున్నాయి. పెద్ద కాలేజీల్లో విద్యార్థు లు క్యాంపస్ ఉద్యోగాలకు ప్రయత్నించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎంతవరకు పరిగణనలోనికి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
భవిష్యత్ కార్యాచరణపై కాలేజీల కసరత్తు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్‌ఆర్‌సీ ముందు హాజరైనా.. భవిష్యత్ కార్యాచరణపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. షెడ్యూల్ ప్ర కారం మొదటి వారం రోజులు ఎఫ్‌ఆర్‌సీ ముందు హాజరయ్యే వాటిల్లో ఒక మోస్తరు కాలేజీలున్నాయి.
వీటి పట్ల కమిటీ ఎలా వ్యవహరిస్తుంది? ఏయే అంశాలను పరిగణనలోనికి తీసుకుంటుంది? ఫీజులు పెంచుతారా? తగ్గిస్తారా? అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. దీని ఆధారంగా వచ్చేవారం సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు ఓ కాలేజీ ప్రతినిధి తెలిపారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడమా? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమా? ఏదీ కాకపోతే సమ్మెకు వెళ్లడమా? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.