అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం
బిల్లుల కేసులో సుప్రీం కీలక తీర్పు
రెండోసారి పంపినా ఆమోదం గవర్నర్ ఇష్టం
అప్పుడు కూడా రాష్ట్రపతికి నివేదించవచ్చు
మంత్రివర్గం సలహా విధిగా పాటించక్కర్లేదు
సుదీర్ఘకాలం ఆపడం మాత్రం సరికాదు
అలాంటప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు
అప్పుడైనా గడువు మాత్రం నిర్దేశించలేవు
సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం స్పషీ్టకరణ
గతంలో ఇచి్చన ‘గడువు’ తీర్పు కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే అంశంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ తలెత్తిన పెను సంక్షోభానికి అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా తెరదించింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానమూ వారికి ఎలాంటి గడువూ విధించజాలదు. అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఎందుకంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ తన గుప్పెట పట్టడమే అవుతుంది. దీన్ని రాజ్యాంగం ఏ రూపంలోనూ అనుమతించలేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేగాక సదరు బిల్లులకు ఆమోదం తెలపడం, రిజర్వులో ఉంచడంపై న్యాయ సమీక్ష కూడా కుదరదని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో సంచలన తీర్పు వెలువరించడం, అది రెండు కీలక వ్యవస్థల నడుమ సంక్షోభానికి దారితీయడం తెలిసిందే.
మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించని పక్షంలో సదరు బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించాలని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ రెండు అంశాలూ చెల్లుబాటు కాబోవని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశంపై గురువారం ఈ మేరకు ఏకగ్రీవంగా 111 పేజీల తుది తీర్పు వెలువరించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం’’అని వ్యాఖ్యానించింది.
142వ అధికరణంలోని ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులకు ఆమోదాన్ని గవర్నర్లు నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం మాత్రం ఎంతమాత్రమూ సబబు కాదని సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా విస్పష్టంగా పేర్కొంది. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా అంతులేని జాప్యం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. వాటిపై పరిమిత న్యాయసమీక్ష జరపవచ్చు’’అని పేర్కొంది. అయితే,
‘‘అప్పుడు కూడా వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించాలే తప్ప రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడానికి వీల్లేదు’’అని స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విచక్షణ మేరకు వ్యవహరించే అధికారం రాజ్యాంగమే కల్పించింది’’అని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం ఈ తీర్పుపై వెలిబుచ్చారు. చరిత్రాత్మక తీర్పు వెలువరించినందుకు రాష్ట్రపతి తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సర్కారు స్పందించలేదు.
ఆపితే తిప్పి పంపాల్సిందే..
ఏ నిర్ణయమూ తీసుకోకుండా గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం కుదరదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అది సబబు కూడా కాదని పేర్కొంది. ‘‘ఏ బిల్లునైనా ఆపితే దాన్ని కచ్చితంగా అసెంబ్లీకి వెనక్కి పంపాల్సిందే. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం బిల్లుల విషయంలో గవర్నర్ల ముందున్నది మూడు దారులు. వాటిని ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం, లేదా పునఃసమీక్ష నిమిత్తం అసెంబ్లీకి తిప్పి పంపడం’’అని సీజేఐ పేర్కొన్నారు. వాటిని ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవచ్చన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘అలా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆపేయాలనుకున్న బిల్లులను అసెంబ్లీకి పంపడం ఆప్షన్‌కాదు, నిబంధన’అని చెప్పారు.
న్యాయమూర్తి పేరు లేదు!
రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును అందులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. 2019లో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసుపై కూడా ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును కూడా అందులో పేర్కొనలేదు.
ఇదీ నేపథ్యం...!
అసెంబ్లీ పంపే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల మితిమీరిన జాప్యం కొన్నేళ్లుగా వివాదాలకు దారితీస్తూ వస్తోంది. ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుకు కారణంగా నిలిచిన కేసు కూడా బిల్లుల ఆమోదం విషయమై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్.రవి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించినదే. అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను ఆమోదించకుండా ఆయన సుదీర్ఘంగా జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దాంతో, చట్టసభలు ఆమోదించి పంపే బిల్లులపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా ఏ నిర్ణయమూ తీసుకోవాలంటూ జస్టిస్ జేబీ పార్డీవాలా ద్విసభ్య ధర్మాసనం గత ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. అది తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ తీర్పు ఆధారంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచడంతో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి.
దాంతో నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని కోర్టులు ఇలా గడువులు పెట్టవచ్చా అంటూ నేరుగా సుప్రీంకోర్టునే నిలదీశారు. ఈ విషయమై పలు సందేహాలు లేవనెత్తుతూ 14 ప్రశ్నలు సంధించి వాటికి బదులు కోరారు. 143(1)వ అధికరణం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించుకుంటూ ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. దాంతో దీనిపై విచారణకు సీజేఐ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.
గడువును వ్యతిరేకిస్తూ కేంద్రం, సమరి్థస్తూ తమిళనాడు సహా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు వాదనలు విని్పంచాయి. అనంతరం గత సెపె్టంబర్ 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నల్లో పదకొండింటిపై తాజా తీర్పులో తమ అభిప్రాయం వెలిబుచి్చంది. మిగతా మూడింటినీ ఈ అంశంతో సంబంధం లేనివిగా పేర్కొంది. ‘‘గవర్నర్లు బిల్లుపై తమ నిర్ణయాన్ని రిజర్వు చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా 143వ అధికరణ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది.


