హద్దుల్లేకుండా.. హల్లో!

Newly 4000 Mobile Tower Installation Odisha - Sakshi

 భువనేశ్వర్‌: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్కు అందుబాటులోకి రానున్నదని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్‌ సాంకేతిక సమాచారం, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 4వేల మొబైల్‌ టవర్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో సమగ్రంగా 6వేల గ్రామాలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ లేదన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు నెట్‌వర్క్‌ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో 3,933 గ్రామీణ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఏ ఒక్క గ్రామం మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకుండా ఇబ్బందులు పడకూడదని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించి, కేబినెట్‌ నోట్‌ ప్రవేశ పెట్టామన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా ఈ చర్య చేపడుతున్నట్లు వివరించారు.  

బీఎస్‌ఎన్‌ఎల్‌కు పునరుజ్జీవం 
దివాలా తీసిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ల్‌)కు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్‌డీఏ సర్కారు పునరుజ్జీవం కల్పించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యతో ఈ సంస్థ గతేడాది నిర్వహణ లాభాల (ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌) స్థాయికి పునరుద్ధరణ సాధించిందన్నారు. బీఎస్‌ఎన్‌ల్‌కు రెండు విడతల్లో ఆర్థిక వనరులు కల్పించిందని తెలిపారు. తొలివిడత కింద 2019లో రూ.90వేల కోట్లు, మలివిడతగా రూ.45వేల కోట్లు ఈ ఏడాది మంజూరు చేశారని ప్రకటించారు.

దీంతో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలు పునరుజ్జీవం పొందాయన్నారు. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, 4జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 5జీ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో తుది మెరుగులు దిద్దుకుంటోందని, ఫోన్, రేడియోకు 5జీ టెక్నాలజీ అనుసంధానంతో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. 

కనీవినీ ఎరుగని నిధులు.. 
రాష్ట్రంలో రైల్వేరంగం సమగ్ర అభివృద్ధికి బడ్జెట్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. యూపీఏ హయాం కంటే 2022–23 బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించామన్నారు. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రానికి ఏటా సగటున సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. 2014–2019 మధ్య బీజేపీ ప్రభుత్వం ఏటా సగటున రూ.4,126 కోట్లు రాష్ట్ర రైల్వే రంగానికి కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైల్వే రంగానికి రూ.9,734 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకంగా వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top