Mumbai: న్యూ ఇయర్‌ వేడుకలు.. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు..

New Year 2023: Mumbai Police Issues Traffic Restrictions - Sakshi

ముంబై(మహారాష్ట్ర): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ట్రాఫిక్‌ పోలీసులు వర్లీలో పార్కింగ్‌ నిబంధనలు జారీ చేశారు. గేట్‌వే ఆఫ్‌ ఇండియా, మెరీనా డ్రైవ్, నారీమన్‌ పాయింట్‌ ప్రాంతాల్లో పలు ట్రాఫిక్‌ షరతులను విధించారు. డిసెంబర్‌ 31 రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటలవరకు ఈ నిబంధనలు  వర్తిస్తాయని తెలిపారు.

కొత్త సంవత్సర సంబురాలను జరుపుకొనేందుకు ముఖ్యంగా గేట్‌వే ఆఫ్‌ ఇండియా, కొలాబా, మెరీన్‌డ్రైవ్, నారీమన్‌పాయింట్, ఇతర సముద్ర తీరాలు, బీచుల్లో, హోటల్స్, క్లబ్‌ల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ డీసీపీ (సౌత్‌) గౌరవ్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్‌ అనుమతులు ఉండవన్నారు. కొన్నిచోట్ల రోడ్లు మూసివేస్తారని పేర్కొన్నారు. అందుకు ప్రత్యామ్నాయ దారులను సూచించారు.  

మూసేసే దారులు  ఇవే..
► ఎన్‌ఎస్‌ రోడ్‌ నార్త్‌ బౌండ్‌లోని ఎన్‌సీపీఏ నుంచి ప్రిన్సెస్‌ స్ట్రీట్‌ ఫ్లైఓవర్‌వరకు అన్ని రకాల వాహనాలకు అనుమతులు లేవు (ప్రిన్సెస్‌ స్ట్రీట్‌ నుంచి ఎన్‌ఎస్‌ రోడ్‌కు వచ్చే మార్గం ఓపెన్‌ ఉంటుంది) 
► మేడమ్‌ కామారోడ్‌ నార్త్‌ బౌండ్‌ నుంచి మంత్రాలయ జంక్షన్, ఎయిర్‌ ఇండియా జంక్షన్‌ వరకు 
► ఫ్రీప్రెస్‌ జర్నల్‌మార్గ్‌ (స్థానికులకు మాత్రమే అనుమతి) 
► ఛత్రపతి శివాజీ మహరాజ్‌ మార్గంలో సౌత్‌బౌండ్‌ 

పార్కింగ్‌ అనుమతులు లేని ప్రాంతాలు 
ఎన్‌ఎస్‌ రోడ్, మేడమ్‌ కామారోడ్, వీర్‌ నారీమణ్‌ రోడ్, ఛత్రపతి శివాజీ మార్గ్, మహాకవి భూషణ్‌ మార్గ్, ఆడమ్‌ స్ట్రీట్, హెన్రీరోడ్, హాజీ నియాజ్‌ అహ్మద్‌ అజ్మీ మార్గ్, పీజే రామ్‌చందానీ మార్గ్, బెస్ట్‌మార్గ్, మహర్షి కార్వే మార్గ్‌.

వర్లీలో నో పార్కింగ్‌ 
నోపార్కింగ్‌ ప్రాంతాల జాబితాను ట్రాఫిక్‌ డీసీపీ రాజ్‌ తిలక్‌ రోషన్‌ బుధవారం విడుదల చేశారు. కొత్త సంవత్సర సంబరాలను జరుపుకొనేందుకు వర్లీ సీఫేస్‌ చౌపట్టీలో ఎక్కువమంది వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిబంధనలు విడుదలచేశారు. సొంత వాహనాల్లో వచ్చేవారు తమ వాహనాలను మేలా జంక్షన్‌ నుంచి జేకే కపూర్‌ చౌక్‌ మధ్య ఉన్న ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ రోడ్‌లో పార్క్‌ చేస్తుండటం వల్ల అది ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతుందన్నారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నో పార్కింగ్‌ జోన్‌గా ప్రకటించారు. అన్ని రకాల వాహనాలనూ నిషేధిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు.
చదవండి: New Year Restrictions: కరోనా విజృంభణ.. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top