రాథోర్‌ పాటలకు పడి పోవాల్సిందే!

Neha Singh Rathore Tunes Going Viral On Social Media - Sakshi

న్యూఢిల్లీ : ‘గౌరీ లంకేష్‌కు పట్టిన గతి నీకు పట్టవచ్చు’ అంటూ నేహా సింగ్‌ రాథోర్‌ను ఆమె స్నేహితులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికను ఆమె బుగ్గలపై చెదరని చిరు నవ్వుతో ఓ అభినందనగా స్వీకరిస్తున్నారు. హిందూ మత ఛాందస వాదులను విమర్శించినందుకు జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేష్‌ను 2017, సెప్టెంబర్‌లో బెంగళూరులో మతోన్మాదులు హత్య చేశారు. ‘ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎప్పటికప్పుడు తన భోజ్‌పురి జానపద పాటల ద్వారా సునిశితంగా విమర్శిస్తోన్న నేహా సింగ్‌ రాథోర్‌కు గౌరీ శంకర్‌కు పట్టిన గతి పడుతుందన్నది ఆమె మిత్రులు, సామాజిక కార్యకర్తల ఆందోళన. ( అంద‌రూ చ‌స్తారు: ప్రయాణికురాలి హ‌ల్‌చ‌ల్‌)

పాలక వర్గాలను విమర్శిస్తూ నేహా సింగ్‌ రాథోర్‌ పాడిన భోజ్‌పూర్‌ జానపదాలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఆమెకు మంచి పేరు తెస్తున్నాయి. ‘ప్రజలకు ఉద్యోగాలిస్తారా లేదా నాటకాలేసుకుంటూ బతకమంటారా? నీవు అలంకరించిన అధికార పీఠం వంశపారంపర్యంగా నీ తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని తెలుసుకో!, అచ్చా దిన్‌ (మంచి రోజులు) వస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, సంకలో జోలి, చేతికి చిప్ప ఇవ్వడమే మంచి రోజని తెలుసుకోలేక పోయాం!’ అనే భావాలతో ఆమె రాసి పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్‌ సరిహద్దులోని జాండహ గ్రామంలో నివసిస్తోన్న రాథోర్, 2019 నుంచి పాటలు రాస్తూ, వాటికి సొంతంగా బాణీలు కూరుస్తూ పాడుతున్నారు.

‘ధరోహర్‌’ పేరిట ఆమె ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానల్‌కు దాదాపు లక్ష మంది సబ్‌స్రై్కబ్‌ చేశారు. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా మంచి ప్రజాదరణ సంపాదించారు. ఆమె అభిమానుల్లో సినిమా దర్శకులు, జర్నలిస్టులు, మాజీ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు. వారణాసికి వంద, పట్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని జాండవ గ్రామంలో 8వ తరగతి వరకే పాఠశాల ఉండడంతో రాథోర్, రామ్‌గఢ్‌లో సెకండరీ ఎడ్యుకేషన్, యూపీలోని కాన్పూర్‌లో బీఎస్సీ చదివారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top