నీట్‌ పేప‌ర్ లీక్‌.. సంచ‌ల‌న విష‌యాలు | NEET paper leak: Accused bought paper at Rs 10L, sold 10 sets for Rs 15L each | Sakshi
Sakshi News home page

ప‌ది ల‌క్ష‌ల‌కు పేప‌ర్ కొని.. 15 ల‌క్ష‌ల చొప్పున‌ అమ్మాడు!

May 13 2026 5:01 PM | Updated on May 15 2026 9:56 AM

NEET paper leak: Accused bought paper at Rs 10L, sold 10 sets for Rs 15L each

నాసిక్‌: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 30 ఏళ్ల‌ వ్యక్తిని మంగ‌ళ‌వారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్‌ పోలీసులు అందించిన వివ‌రాలు, సోష‌ల్ మీడియాలో ల‌భించిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించిన‌ట్టు వెల్ల‌డించారు.

నాసిక్ పోలీసుల‌ ప్రకారం.. నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ క‌లిగివున్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్‌లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని అత‌డు నడుపుతున్నాడు. నిందితుడు రూ. 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన‌ట్టు ప్రాథమిక విచారణలో వెల్ల‌డైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్‌ను రూ. 15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు.

“మంగళవారం మధ్యాహ్నం నాసిక్‌లోని నందగావ్, ఇందిరా నగర్‌లో నిందితుడిని అరెస్టు చేశాం. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు. అతను లీకైన పేపర్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారుచేసి, వైద్య ప్రవేశ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్‌ను రూ.15 లక్షలకు విక్రయించాడ''ని నాసిక్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ పేపర్ లీక్ నెట్‌వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని వారు తెలిపారు.

ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్‌?
కాగా, నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీకయిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్‌ అయిన పేపర్‌ తొలుత రాజస్తాన్‌లోని జైపూర్‌కు, తర్వాత సికార్‌ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాసిక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన ఓ అనుమానిత‌ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్‌ పేపర్‌ను చైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.

చ‌ద‌వండి: నీట్‌ పేప‌ర్ లీకేజీ.. ఎలా బయటపడింది?

గెస్ పేపర్ లేదు: డీఎస్పీ
నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ రాష్ట్రాల్లో 15 మంది వ‌ర‌కు అనుమానితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోనూ ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిల్లో త‌మకు ఎలాంటి ప్రశ్నపత్రం గానీ, గెస్ పేపర్ గానీ లభించలేదని రాజ్‌గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కేవ‌లం న‌గదు లావాదేవీల‌కు సంబంధించిన చాట్‌లు మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. 

విద్యార్థి సంఘాల ఆందోళ‌న‌లు
నీట్-యూజీ 20026 పరీక్ష లీకేజీ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధ‌వారం ఆందోళ‌న చేప‌ట్టాయి. కేరళంలోని పాలక్కాడ్‌, క‌న్నూరుయ ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి వారిని పోలీసులు నిలువ‌రించ‌డంతో తోపులాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎన్‌టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. ఎన్‌టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. ఎన్‌టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement