ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే లీక్‌? | NEET paper leakage case takes new twist: Leak from printing press | Sakshi
Sakshi News home page

NEET: ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే లీక్‌?

May 13 2026 3:13 AM | Updated on May 13 2026 4:08 PM

NEET paper leakage case takes new twist: Leak from printing press

నాసిక్‌ నుంచి జైపూర్‌కు..  తర్వాత సికార్‌కు చేరవేత  

ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చేరిన నీట్‌ ప్రశ్నపత్రం  

సికార్‌ హాస్టల్‌ నిర్వాహకుడి అప్రమత్తతతో బయటపడిన బాగోతం  

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రశ్నపత్రాలను ముద్రించినట్లు సమాచారం. నేరుగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే లీక్‌ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. లీక్‌ అయిన పేపర్‌ తొలుత రాజస్తాన్‌లోని జైపూర్‌కు, తర్వాత సికార్‌ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేసినట్లు అంచనా వేస్తున్నారు. నాసిక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్‌ పేపర్‌ను చైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు తెలుస్తోంది.

హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఈ పేపర్‌ ఇలాగే చేరింది. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఖతీక్‌ అనే వ్యక్తి ఆ డాక్టర్‌ దగ్గర ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత జైపూర్‌ నుంచి పేపర్‌ సికార్‌లోని రాకేశ్‌ కుమార్‌కు చేరింది. అతడు సికార్‌లోని ఒక కోచింగ్‌ సెంటర్‌ ఎదుట ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. సికార్‌లో నీట్‌ శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులకు పేపర్‌ను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకైన పేపర్‌ అంచెలంచెలుగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలకు విస్తరించింది. డబ్బులిచ్చినవారికి సోషల్‌ మీడియా ద్వారా పంపించారు.  

ఏమిటీ గెస్‌ పేపర్‌?  
గెస్‌ పేపర్‌ ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా అసలైన ప్రశ్నపత్రానికి మరికొన్ని కొన్ని ప్రశ్నలు కలిపి విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గెస్‌ పేపర్‌ అంటే విద్యార్థులు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలుగా ట్యూటర్లు రూపొందించే ప్రశ్నలు. గత ఏడాది, అంతకుముందు ఏడాది పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఈ గెస్‌ పేపర్‌ రూపొందిస్తుంటారు. విద్యార్థులు తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికి గెస్‌ పేపర్లు సాధన చేస్తుంటారు.

మే 3న నీట్‌ పరీక్ష జరగ్గా, 15 రోజుల ముందు లీకైన పేపర్‌ను విక్రయించడం ప్రారంభించారు. రూ.30 వేల నుంచి రూ.30 లక్షల దాకా అభ్యర్థులు వెచ్చించినట్లు ప్రచారం సాగుతోంది. రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన ఓ విద్యార్థి పరీక్షకు నాలుగు రోజుల ముందు సికార్‌ టౌన్‌కు చేరుకున్నాడు. రూ.28 లక్షలు ఖర్చు చేసి, నీట్‌ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. అతడిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ‘పేపర్‌ సిద్ధంగా ఉంది’అంటూ తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని అతడు పేర్కొన్నాడు.  

ఎలా బయటపడింది?  
పేపర్‌ లీక్‌ మాఫియా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎక్కడా తమ గుట్టు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి అదృష్టం బాగాలేక అడ్డంగా దొరికిపోయారు. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ఏజెంట్‌ రాకేశ్‌ కుమార్‌ రూ.30,000కు ‘గెస్‌ పేపర్‌’ను తనకు తెలిసిన సికార్‌ విద్యార్థికి విక్రయించాడు. ఈ విద్యార్థి దాన్ని సికార్‌లో హాస్టల్‌ను నడిపించే తన తండ్రికి చేరవేశాడు. ఆ తండ్రి తన హాస్టల్‌లో ఉంటున్న నీట్‌ విద్యార్థులకు ఆ పేపర్‌ను అందించాడు. మే 3న పరీక్ష ముగిసిన తర్వాత గెస్‌ పేపర్‌ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చెప్పాలంటూ ఓ కోచింగ్‌ సెంటర్‌ లెక్చరర్‌ను కోరాడు. 

గెస్‌ పేపర్‌లో మొత్తం 281 ప్రశ్నలు ఉండగా, అందులో బయాలజీలో 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంలో అచ్చుగుద్దినట్లుగా వచ్చేశాయి. అంతేకాకుండా కెమిస్ట్రీకి సంబంధించిన 45 ప్రశ్నలు గెస్‌ పేపర్‌లో ఉన్నట్లు సరిగ్గా అదే వరుస క్రమంలో ఉన్నాయి. కనీసం కామాలు, ఫుల్‌స్టాప్‌ల్లోనూ మార్పుల్లేవు. దీనిపై అనుమానం వచ్చిన హాస్టల్‌ నిర్వాహకుడు తొలుత సికార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు.

తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మందలించారు. దాంతో అతడు ఎన్‌టీఏ అధికారులకు సమాచారం చేరవేశాడు. అనంతరం ఎన్‌టీఏ సిబ్బంది ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)తోపాటు రాజస్తాన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. రాజస్తాన్‌ ఎస్‌ఓజీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్‌ కుమార్‌ సహా దాదాపు 20 మందిని అరెస్టుచేశారు. జేఈఈ–నీట్‌ పరీక్షల కోచింగ్‌కు సికార్‌ ప్రసిద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పేపర్‌ లీక్‌ అంశంలో మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో సీబీఐ నిమగ్నమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement