NEET: కీ పేపర్‌ చూస్కోని యువతి అదృశ్యం

Neet Aspirant Missing In TN After Checking Key Paper - Sakshi

తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం స్టాలిన్‌, నటుడు సూర్య విజ్ఞప్తి

ఇప్పటికే ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం

మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు

చెన్నె: నీట్‌ భయం ఇంకా తమిళనాడు విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట్‌ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్‌ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్‌ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండాపోయింది.

దీంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కర్‌ జిల్లాకు రాసిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన శ్వేత (19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌-నీట్‌)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షకు సంబంధించిన కీ పేపర్‌ చూసుకుంది. ఉత్తీర్ణత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అదృశ్యం కేసు ఫిర్యాదు చేయడంతో రాసిపురం పోలీసులు గాలిస్తున్నారు. 

అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్‌ మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ‘పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్‌ ఎంతో ఉంది’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ పిలుపునిచ్చారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top