నీట్ రద్దే కారణమంటున్న కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన నీట్ అభ్యర్థిని(26) ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. కొన్నేళ్లుగా నీట్ కోసం సిద్ధమవుతున్న ఆమె పరీక్ష రద్దుతో మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి సూసైట్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం చేయించారు. ఉరి వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


