బెంగాల్, మహారాష్ట్రల్లో ‘నవమి’ ఉద్రిక్తతలు

Navami tensions in Bengal and Maharashtra - Sakshi

దుకాణాలు ధ్వంసం, వాహనాలకు నిప్పు

పోలీసులకు గాయాలు  

న్యూఢిల్లీ/హౌరా: రామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్‌లోని హౌరా నగరంలోని కాజీపారా ప్రాంతంలో గురువారం సాయంత్రం రామనవమి ర్యాలీ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. రెచ్చిపోయిన దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు ఆటోలు, దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కిరాద్‌పురా రామాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్, ప్లాస్టిక్‌ బుల్లెట్‌లను ప్రయోగించడంతోపాటు కాల్పులు కూడా జరిపారు.

సుమారు 500 మందితో కూడిన గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఈ సందర్భంగా 10 మంది పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇదే ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు 13 వాహనాలకు నిప్పుపెట్టాయి. రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శ్రీరామ్‌భగవాన్‌ ప్రతిమ యాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, కొందరు నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ యాత్ర నిర్వహించారు. గత ఏడాది ఇక్కడే హనుమాన్‌ జయంతి వేడుక రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. గుజరాత్‌లోని వడోదరాలో రెండు రామనవమి ర్యాలీలపై దుండగులు రాళ్లు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top