ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం | Narendra Modi said India successfully navigated the global energy crisis | Sakshi
Sakshi News home page

ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం

Jul 5 2026 4:21 AM | Updated on Jul 5 2026 4:21 AM

Narendra Modi said India successfully navigated the global energy crisis

పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం  

ప్రజలను భయపెట్టాలని చూసిన శక్తులకు నిరాశే మిగిలింది  

ఏప్రిల్‌–జూన్‌లో చమురు కంపెనీలు రూ.75,000 కోట్లు నష్టపోయాయి  

ఆ నష్టభారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది  

స్వయం సమృద్ధిని సాధించినప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుంది 

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టికరణ  

రాజస్తాన్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ రిఫైనరీ–పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం  

పాచ్‌పద్రా/జోధ్‌పూర్‌:  ఈ శతాబ్దంలో అతిపెద్ద ప్రపంచ ఇంధన సంక్షోభాల్లో ఒకదానిని మనం విజయవంతంగా అధిగమించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చురుకైన ప్రభుత్వ విధానాలు, వైవిధ్యమైన ఇంధన వనరులు, బలమైన దౌత్య సంబంధాల ద్వారా పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించామని తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా ప్రధాన దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. ఇంధనం విషయంలో కొన్ని శక్తులు ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యాయని విమర్శించారు. రాజకీయ క్రీడలు సాగాయని అన్నారు. 

కానీ, ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆ శక్తుల పథకం పారలేదని, తీవ్ర నిరాశలో కూరుకుపోయాయని ఎద్దేవా చేశారు. సంక్షోభాన్ని మనం అధిగమించిన తీరు చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయంగా గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. బలోత్రాలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ రిఫైనరీ–పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని గుర్తుచేశారు. 

అనేక శక్తివంతమైన దేశాలు ఇంధన కొరతతో సతమతమయ్యాయని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం, మన వనరులను సమతుల్యంగా ఉపయోగించడం, దౌత్య బలాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ద్వారా ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నామని స్పష్టంచేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ రిఫైనరీని ఏప్రిల్‌ 21న మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా, 20న జరిగిన అగి్నప్రమాదం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేసినందుకు అధికారులను మోదీ అభినందించారు.  

చమురు సామర్థ్యంలో నాలుగో స్థానం  
అనేక అభివృద్ధి చెందిన దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో విఫలమైనప్పటికీ.. భారతదేశం మాత్రం ఆ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరింపజేసుకుంది. గత 50 ఏళ్లలో అమెరికా కొత్తగా చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించలేదు. ఐరోపా శుద్ధి సామర్థ్యం నానాటికీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అయిల్‌ రిఫైనరీ సామర్థ్యం పరంగా భారత్‌ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈ సామర్థ్యం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య మన దేశ చమురు కంపెనీలు రూ.75,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయి.

అయితే, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించింది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ఇంధనాన్ని కోటా పద్ధతిలో పంపిణీ చేశారు. మన దేశంలో ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి తలెత్తలేదు. కొందరు మాత్రం చమురు విషయంలో వదంతులు వ్యాప్తి చేశారు. ప్రజలను భయపెట్టారు, రాజకీయ క్రీడలు ఆడారు. కానీ, వారు సఫలం కాలేకపోయారు. సంక్షోభ సమయంలో మనం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం చరిత్రలో భాగం అవుతుంది. భారత్‌ 
విఫలం కావాలని కోరుకున్నవారికి చివరకు పరాభవమే మిగిలింది.  

‘ఉడాన్‌’తదుపరి దశ ప్రారంభం  
ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్‌’తదుపరి దశను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అలాగే జోధ్‌పూర్‌ విమానాశ్రయంలో రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెరి్మనల్‌ భవనాన్ని ప్రారంభించారు. సవరించిన ఉడాన్‌ పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు రాబోయే పదేళ్లలో దాదాపు రూ.29,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు.  

రూ. 2,000 సిలిండర్‌ రూ. 950కే లభిస్తోంది  
మన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఆ సరఫరాలలో సుమారు 90 శాతం ఎల్పీజీ హార్మూజ్‌ జలసంధి గుండా గల్ఫ్‌ దేశాల నుంచి వస్తోంది. హార్మూజ్‌లో ఆటంకాలు మొదలైన తర్వాత దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయించింది. పారిశ్రామిక గ్యాస్‌ ఉత్పత్తి స్థానంలో ఎల్పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏడు రోజుల్లోనే రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సంక్షోభ సమయంలో ఎల్పీజీ ఉత్పత్తి 54,000 మెట్రిక్‌ టన్నులు పెరిగింది.

ఎల్పీజీకి దేశీయ డిమాండ్‌ అదుపులో ఉండేలా పీఎన్‌జీ కనెక్షన్లు వేగంగా విస్తరించేలా ప్రభుత్వం ఏకకాలంలో చర్యలు తీసుకుంది. చాలా తక్కువ సమయంలోనే 11 లక్షలకు పైగా గృహాలకు పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చాం. పెరుగుతున్న ధరల భారం నుంచి గృహ వినియోగదారులకు రక్షణ కల్పించాం. ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2,000 వరకు ఉంటుంది. కానీ, నేడు అది రూ.950కే లభిస్తోంది. హార్మూజ్‌లో ముడి చమురు మార్గాలకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగాయి.

ఆ సమయంలో ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతులను గణనీయంగా పెంచాం. 40కిపైగా దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నాం. ఈ మార్పునకు భారత్‌ అనుసరించిన దౌత్యమే కారణం. లీటర్‌కు రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి, పౌరులపై భారం పెరగకుండా చర్యలు చేపట్టాం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఎరువుల సరఫరాపై ప్రభావం పడింది. ఆ ప్రతికూల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. వ్యక్తి లేదా దేశం స్వయం సమృద్ధిని సాధించినప్పుడే వారి ఆత్మగౌరవం ఉన్నత స్థాయిలో ఉంటుంది’’అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.  

సెమీకండక్టర్, ఏఐ రంగాల్లో అవకాశాలు వదులుకోవద్దు 
సంపూర్ణ సెమీకండక్టర్‌ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం: మోదీ
అహ్మదాబాద్‌:  ఉత్పత్తులు, విడిభాగాల నుంచి సెమీకండక్టర్ల వరకు మొత్తం విలువైన ఎల్రక్టానిక్స్‌ వ్యవస్థను భారత్‌ నిర్మిస్తోందని, ఇదే ‘వికసిత్‌ భారత్‌’కు రోడ్‌మ్యాప్‌ అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌(ఓఎస్‌ఏటీ) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సెమీకండక్టర్, కృత్రిమ మేధ(ఏఐ) రంగాలు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, దీన్ని భారతీయ యువత వదులుకోవద్దని కోరారు.

మనం కేవలం చిప్‌లను తయారు చేయడమే కాకుండా ఏఐ, రోబోటిక్స్, తదుపరి తరం సాంకేతిక విప్లవాన్ని వేగవంతం చేయబోతున్నామని చెప్పారు. మన యువత ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’చిప్‌లను ఉపయోగించబోతున్నారని తెలిపారు. యువత సామర్థ్యం, ప్రతిభపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కొత్త పారిశ్రామిక విప్లవం సంభవించినా, అది యువతకు అత్యధిక సంఖ్యలో అవకాశాలను కల్పిస్తుందని గుర్తుచేశారు.

మనదేశంలో సెమీకండక్టర్‌ పరిశ్రమ విస్తరణ రాత్రికి రాత్రే జరగలేదని, గత దశాబ్ద కాలంగా చోటుచేసుకున్న ఎల్రక్టానిక్స్‌ విప్లవంలో ఇది తదుపరి దశ అని వివరించారు. దేశంలో చిప్‌ డిజైన్‌ నుంచి తయారీ, ప్యాకేజింగ్‌ వరకు సంపూర్ణ సెమీకండక్టర్‌ వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

ఆ్రస్టేలియా పర్యటన వేళ దాడి చేస్తామని మోదీకి బెదిరింపు 
దర్యాప్తు ముమ్మరం చేసిన ఆస్ట్రేలియా పోలీసులు
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భా రత ప్రధాని మోదీకి తాజాగా ఒక ఆన్‌లైన్‌ బెదిరింపు వచి్చంది. మెల్‌బోర్న్‌ నగరంలోని ప్రఖ్యా త మార్వెల్‌ స్టేడియంలో జరగబోయే సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడ దాడి చేస్తామంటూ సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్‌ ప్రత్యక్షమైంది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీసులు వెంటనే ముమ్మర దర్యాప్తు ఆరంభించారు.

ఈ పోస్ట్‌తో సంబంధం ఉన్న అబూ ముస్తాఫా ఐడీతో ఉన్న ఐపీ అడ్రస్‌ను కనుగొన్నామని వెల్లడించారు. ఈనెల 9వ తేదీన ‘మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ’కార్యక్రమం ఆ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ స్టేడియంనుద్దేశిస్తూ అబూ ముస్తాఫా యూజర్‌నేమ్‌ నుంచి ఈ పోస్ట్‌ చేశారు. ‘‘స్టేడియం పైకప్పును మూసేస్తే ఉత్తమం అనుకుంటున్నా. లేదంటే ఆయన తన మృత్యుదేవతను చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు అవుతుంది’’అని ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. ఇది కేవలం బెదిరింపు సందేశమా లేదంటే గతంలో ఈ ఐపీ అడ్రస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు నేర చరిత్ర ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement