రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు!

Mumbai: Man Sold  22 Lakh Car Help Covid Patients Oxygen Cylinders - Sakshi

ముంబై: దేశంలో కోవిడ్‌-19 సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ల కోసం దేశంలో పలు చోట్ల కరోనా రోగులు, వారి బంధువులు పడుతున్న ఇబ్బందులు, ఆవేదన అన్ని ఇన్నీ కావు. ఓ పక్క ప్రభుత్వాలు ఇందుకు కావాల్సిన చర్యలను ముమ్మరం చేసినప్పటికీ కరోనా వైరస్‌ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరగడంతో అవి సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారిక సహాయం చేసేందుకు ముంబయికి చెందిన షానవాజ్‌ షేక్‌ అనే యువకుడు ముందుకు వచ్చి తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. అందుకోసం ఏకంగా తను ఎంతో ఇష్టపడి కొన్న కారునే అమ్మేశాడు.

వివరాల్లోకి వెళితే.. షానవాజ్‌ గత సంవత్సరం, తన స్నేహితుడి భార్య ఆటో రిక్షాలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించడం చూసి చలించిపోయాడు. ఇక ఆ తర్వాత ముంబైలోని రోగులకు ఆక్సిజన్ సరఫరా ఏజెంట్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతేకాక ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు ఆక్సిజన్ పొందడంలో సమస్యలు ఉండకుండా అతను ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను కరోనా బాధితులకు సహాయార్థం తన ఫోర్డ్ ఎండీవర్ కారుని కూడా అమ్మేశాడు. ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆపదలో ఉన్నవారికి అందిస్తున్నాడు. గత సంవత్సరం పేదలకు సహాయం చేస్తున్నప్పుడు డబ్బు అయిపోయిందని, అందువల్ల అతను తన కారును అమ్మవలసి వచ్చిందని షానవాజ్‌ చెప్పాడు.

గత సంవత్సరంతో పోల్చితే ఈసారి పరిస్థితి ఒకేలా లేదని, ఈ జనవరిలో తనకు ఆక్సిజన్ కోసం 50 కాల్స్ వచ్చాయని, ప్రస్తుతం ప్రతిరోజూ 500 నుంచి 600 ఫోన్ కాల్స్ వస్తున్నాయని షానవాజ్‌ తెలిపారు. ఇప్పటివరకు తన బృందంతో కలిసి షానవాజ్‌ 4000 మందికి సాయమందించినట్లు చెప్పుకొచ్చాడు

( చదవండి: పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్‌.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top