ఫిరాయింపుల పిటిషన్ల బాధ్యత స్పీకర్ల నుంచి తప్పించాలి
పార్టీ మారితే ఆ టర్మ్ పూర్తయ్యే దాకా ఎన్నికల్లో పోటీ చేయకూడదు
చట్టాలను కాపాడుకోలేనప్పుడు ఉన్నత పదవులు దేనికి?
పార్లమెంటుకు పంపిన మాజీ సీఎం జగన్‌కు, మహానేత వైఎస్సార్‌కు కృతజ్ఞతలు
రాజ్యసభ వీడ్కోలు సభలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలు కళ్ల ముందే ఉల్లంఘనకు గురవుతున్నాయని, పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటువేసే అధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి హైకోర్టులకు అప్పగించాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సమావేశంలో బుధవారం ఆయన తెలుగులో మాట్లాడారు.
స్పీకర్ల స్థానంలో హైకోర్టులే తేల్చాలి..
ప్రజాప్రాతినిధ్య చట్టం ఒక పవిత్ర లక్ష్యంతో ఏర్పడిందని.. అయితే, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న వారిపై స్పీకర్లు సకాలంలో చర్యలు తీసుకోలేకపోతున్నారని బోస్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నేతను న్యాయాధికారిగా కూర్చోబెడితే న్యాయం జరగదని చెప్పారు. పార్టీ మారిన వారిని ఆ పదవీకాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత విధించాలని ప్రధానిని కోరారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకోర్టులకు బదిలీచేసి, మూడు నుంచి ఆరు నెలల్లోగా నిర్ణయం వెలువడేలా కచ్చితమైన గడువు విధించాలని ఆయన సూచించారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) అమలులోనూ రాష్ట్రాల్లో లోపాలున్నాయని, ప్రభుత్వ జీఓలను దాచిపెడుతున్నారని ఆయన ప్రస్తావించారు. చట్టాలను కాపాడుకోలేనప్పుడు రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవులు దేనికని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. ఇక్కడ చేసిన చట్టాలను మన కళ్లముందే తూట్లు పొడుస్తూ నాశనం చేస్తుంటే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు.
చివరగా.. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ వంటి దిగ్గజాల సరసన కూర్చునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని బోస్ సంతోషం వ్యక్తంచేశారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులంతా తిరిగి సభకు ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు.
మహానేతకు, మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు..
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత రాయవరం మునసబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని బోస్ స్మరించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఓబీసీ (శెట్టిబలిజ) సామాజికవర్గం నుంచి పార్లమెంటు మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని తానేనని ఇందుకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


