ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో

MP Mohan Delkar Left 15 Page Note Post Mortem Confirms Suicide - Sakshi

ఎంపీ మోహన్‌ దేల్కర్‌ది ఆత్మహత్యగా నిర్ధారించిన పోస్ట్‌మార్టం రిపోర్టు

వైరలవుతోన్న నాలుగు నెలల నాటి లోక్‌సభ ప్రసంగం వీడియో

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదిక  ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా నిర్ధారించింది. అంతేకాక ఘటనా స్థలం నుంచి పోలీసులు 15 పేజీల సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక లెటర్‌హెడ్‌ మీద గుజరాతీలో ఉన్న ఈ లేఖలో ఎంపీ ఆత్మహత్యకు గల కారణాలను వివరించినట్లు సమాచారం. లేఖలో ఉన్న విషయాల గురించి పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. 

సోమవారం ఉదయం సౌత్‌ ముంబైలోని ఓ హోటల్‌లో మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం డ్రైవర్‌ వచ్చి హోటల్‌ రూమ్‌ తలుపు కొట్టాడు. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. దాంతో అతడు ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు హోటల్‌ సిబ్బందికి విషయం చెప్పమని సూచించడంతో.. డ్రైవర్‌ హోటల్‌ స్టాఫ్‌కి విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు‌ బల్కానీలో నుంచి గది లోపలికి ప్రవేశించి చూడగా.. అక్కడ సీలింగ్‌ ఫ్యాన్‌కు మోహన్‌ ఉరి వేసుకుని ఉండటం కనిపించింది. దాంతో డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం పోలీసులు మోహన్‌ దేల్కర్‌ డ్రైవర్‌, బాడీగార్డును విచారిస్తున్నారు. 

ఇక మోహన్‌ మృతి చెందిన తర్వాత గతేడాది అతడు లోక్‌సభలో ప్రసంగించిన ఓ వీడియో తెగ వైరలయ్యింది. దీనిలో అతడు.. ‘‘గత నాలుగు నెలలుగా కొందరు అధికారులు నన్ను అవమానించాలని.. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. మహమ్మారి సమయంలో, కొంతమంది అధికారులు నన్ను తప్పుడు కేసులలో బుక్ చేయడానికి ప్రయత్నించారు. నా విధులను నిర్వర్తించడానికి నన్ను అనుమతించలేదు. అందువల్ల నేను ప్రజలకు సహాయం చేయలేకపోయాను. కేంద్ర పాలిత దాద్రా, నగర్ హవేలీల ముక్తి దివాస్ సందర్భంగా నన్ను అవమానించారు. 35 సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయం ప్రకారం దాద్రానగర్ హవేలీ ప్రజలను ఉద్దేశించి నేను ప్రసంగించకుండా అడ్డుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి నన్ను ఎందుకు అనుమతించలేదని నేను అడిగినప్పుడు, డిప్యూటీ కలెక్టర్, ఈవెంట్ నిర్వాహకులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇది నాపై జరుగుతున్న కుట్ర" అని మోహన్‌ ఈ వీడియోలో వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top