
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.
ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.
తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.
మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.
‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.
మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది.