ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌: నెంబర్‌ 1 గా నిలిచిన భారత్‌ | Most Internet Shutdowns In India | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌: నెంబర్‌ 1 గా నిలిచిన భారత్‌

Mar 8 2021 5:16 PM | Updated on Mar 8 2021 8:53 PM

Most Internet Shutdowns In India - Sakshi

అయితే, 2020లో భారత్‌ అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్లను చూసినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. ఇంటర్నెట్‌తో సాంకేతికంగా ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటున్నప్పటికీ అంతే స్థాయిలో మానవ సంబం‍ధాలపై చెడు ప్రభావం పడుతోంది. ఇక కరోనా పుణ్యామాని గతేడాది అందరికీ కష్టంగా గడిచింది. అడుగు బయట పెట్టని పరిస్థితుల్లో అధిక స్థాయిలో ఇంటర్నెట్‌ వినియోగం జరిగింది. అయితే, 2020లో భారత్‌ అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్లను చూసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కారణాలతో భారత్‌లో ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్టు తెలిపింది.

పోయిన ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ చేసిన 29 దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్‌ నిలుపుదల సంఘటనలు మన దేశంలో జరగగా, కొన్ని మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 ఇంటర్నెట్ షట్డౌన్లు విధించగా, వీటిలో  109 ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌లు కేవలం భారత్‌లోనే ఉన్నాయి. యాక్సెస్ నౌ నివేదిక ప్రకారం, 2019లో కూడా అత్యధికంగా 121 సార్లు ఇంటర్నెట్‌ నిలిపివేయగా, వెనిజులాలో 12 , ​​యెమెన్లో 11, ఇరాక్ లో  8, అల్జీరియాలో 6, ఇథియోపియాలో 4 సార్లు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

భారత ప్రభుత్వం 2020లో 109 సార్లు  ఇంటర్నెట్‌ను నిలిపివేయగా, గత రెండేళ్ళలో పోల్చితే ఈ సంఖ్య  తక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ఆగస్టు 2019 నుంచి శాశ్వతంగా ఇంటర్నెట్‌ను నిలిపివేయగా తిరిగి ఇంటర్నెట్‌ను 18 నెలల తరువాత పునరుద్ధరించారు. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్‌లో, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ గతంలో మాధ్యమిక్ (మాధ్యమిక పాఠశాల) పరీక్షల సమయంలో కర్ఫ్యూ తరహా ఇంటర్నెట్ బ్లాక్అవుట్‌ను ప్రవేశపెట్టింది, ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపారు. ఈ ఇంటర్నెట్ కర్ఫ్యూ తొమ్మిది రోజులకు పైగా కొనసాగిందని నివేదిక పేర్కొంది.

భద్రతా పరంగా సున్నిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు రెండేళ్లుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేకుండా పోయింది. ఫిబ్రవరి 2021 లో జమ్మూ కాశ్మీర్‌లో 4 జి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించే ముందు జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో, కశ్మీర్‌ ప్రజలు 2 జి ఇంటర్నెట్ సేవలను మాత్రమే పొందగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement