కాక్‌టైల్‌ వ్యాక్సిన్‌ సరైంది కాదు

Mixing Covid vaccines is very wrong - Sakshi

సీరమ్‌ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా

పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్‌ల అవసరం లేదని అన్నారు.

ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్‌లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు.

రెడ్‌ టేపిజం బాగా తగ్గింది
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌ టేపిజం, లైసెన్స్‌ రాజ్‌ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్‌లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top