బనశంకరి( బెంగళూరు): నిశ్చితార్థం అయి, త్వరలో పెళ్లాడబోయే యువతిని యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన బెంగళూరు డీజే హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. స్థానికులు యువతి జోయా (19), షబీల్ (20)కు నిశ్చితార్థమైంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో చక్కెరమండీ ఏరియాలోని తన కుటుంబానికి చెందిన పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు.
అక్కడ షబీల్ చాకుతో జోయా గొంతుకోసి హత్యచేసి ఉడాయించాడు. కొన్ని గంటలకు షబీల్ కుటుంబసభ్యులు అక్కడికి రాగా యువతి శవం కనబడింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించి, శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పు డీసీపీ విక్రమ్ అమటి మాట్లాడుతూ మాకు 11 గంటలకు 112 కు ఫోన్‌కాల్ వచ్చిందని తెలిపారు. పరారీలో ఉన్న యువకుడు అరెస్టయితే హత్యకు కారణం తెలుస్తుందన్నారు.
ఆస్తి కోసం ప్రియురాలి హత్య
దొడ్డబళ్లాపురం: ప్రియురాలిని హత్య చేసి పరారైన ప్రియున్ని బెళగావి జిల్లా అథణి పోలీసులు ఏపీలో శ్రీశైలంలో అరెస్టు చేశారు. వివరాలు.. అథణి నివాసి కుమార్ కల్లప్ప (34), సుజాత (34) అనే మహిళను చెరుకు తోటలో గొంతు పిసికి చంపి శ్రీశైలానికి పారిపోయాడని జిల్లా ఎస్పీ రామరాజన్ తెలిపారు. 12వ తేదీన కుళ్లిన స్థితిలో మహిళ శవం బయటపడింది. సుజాత భర్తకు దూరంగా ఉంటోంది. కొన్నాళ్లకు కుమార్‌తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. సుజాతకు ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని నిందితుడు ఒత్తిడి చేయగా ఆమె తిరస్కరించింది. కక్ష పెంచుకుని ఈ నెల 7న ఆమెను తన చెరుకు తోటకు తీసికెళ్లి హతమార్చాడు.


