
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో కలకలంరేపే ఉదంతం చోటుచేసుకుంది. ఒక డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో పురుషుని మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. ఒక ఇంటి యజమాని ఏవో పనుల కోసం తమ మొదటి అంతస్థుకు వెళ్లినప్పుడు, అక్కడ దుర్వాసన రావడాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది.
ఈ ఘటన తిజారా జిల్లాలోని ఆదర్శ్ కాలనీలో చోటుచేసుకుంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ వ్యక్తి అని, అతను ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడని, అతనిని హన్స్‌రాజ్‌గా గుర్తించామని తెలిపారు. కాగా ఈ ఘటన అనంతరం అతని భార్య, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా ఒక నీలిరంగు డ్రమ్ములో మృతదేహాన్ని పడవేసి, దానిపై మూత ఉంచి, ఒక పెద్ద రాయిని దానిపై పెట్టారు.
‘ఆదర్శ్ కాలనీలోని ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు చేయగా, ఇంటి డాబాపై ఉన్న నీలిరంగు డ్రమ్ములో ఒక యువకుని మృతదేహం కనిపించింది. బాధితుడిని హన్స్‌రాజ్ అలియాస్ సూరజ్‌గా గుర్తించాం’ అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ మీడియాకు తెలిపారు.
బాధితుడు ఉత్తరప్రదేశ్ నివాసి అని, నెలన్నర క్రితం ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడని, తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడని రాజేష్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించింది. ఆ మృతదేహం డ్రమ్ములో ఎంతకాలం నుంచి ఉందో, అతని హత్యకు గల కారణం ఏమిటో ఇంకా వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.