దినసరి కూలీకి భారీ షాక్‌.. చివరికి..

Man Chased For GST Fraud A Daily Wage Worker Jharkhand - Sakshi

సంపాదన రూ. 198; 3.5 కోట్ల మేర పన్ను ఎగవేత! 

రాంచీ: రోజుకు 198 రూపాయలు సంపాదించే కూలీకి జీఎస్టీ డిపార్టుమెంటు భారీ షాకిచ్చింది. అక్షరాలా మూడున్నర కోట్ల మేర పన్ను ఎగవేశారంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సదరు కూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు గురువారం ఆయనను అరెస్టు చేశారు. వివరాలు.. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూం జిల్లాలోని రాణీపహారీ గ్రామానికి చెందిన లాడన్‌ ముర్ము నిరుపేద. తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుడైన అతడు కూలీగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబరులో కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్లు ఆయన ఇంటికి వచ్చారు. ఎంఎస్‌ స్టీల్‌ కంపెనీ ఎండీ అయిన ముర్ము రూ. 3.5 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారని, ఈ మొత్తం చెల్లించకపోతే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. (చదవండి: రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్‌ సస్పెండ్‌)

ఈ నేపథ్యంలో పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. కంపెనీ గురించి తనకేమీ తెలియదని, తన వద్ద డబ్బు లేదని సమాధానమిచ్చారు. దీంతో గురువారం ముర్ము ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సాయంత్రం విడిచిపెట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి ఎస్‌ఎస్‌పీ డాక్టర్‌ ఎం. తమిల్‌ వణన్‌ మాట్లాడుతూ.. ‘‘గతేడాది తాము పంపిన నోటీసులకు బదులివ్వని కారణంగా ఎంఎస్‌ స్టీలు కంపెనీ ఎండీ లాడన్‌ ముర్ముపై జీఎస్టీ డిపార్టుమెంటు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. దీంతో మా బృందం గురువారం ఆయన ఇంటికి చేరుకుంది. ఎంజీఎన్‌ఆర్‌ఈఏ పథక లబ్దిదారు అయిన ముర్ము పాన్‌, ఆధార్‌ కార్డును ఉపయోగించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డట్లు తెలిసింది. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.( చదవండి: అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం)

ఇక బాధితుడు ముర్ము స్పందిస్తూ.. ‘‘వరుసకు కుమారుడయ్యే బైలా ముర్ము 2018లో నా కో-ఆపరేటివ్‌ బ్యాంకు పాస్‌బుక్‌, పాన్‌, ఆధార్‌ కార్డు తీసుకున్నాడు. నా అకౌంట్‌ను ప్రభుత్వం ప్రతినెలా రూ. 2 వేలు జమ చేస్తుందని చెప్పాడు. ఈ పత్రాలన్నింటిని తన అల్లుడు సునరం హేంబ్రంకు ఇచ్చినట్లు తెలిసింది. సునరం వీటిని జంషెడ్‌పూర్‌కు చెందిన సుశాంత్‌ కుమార్‌ సమాంటోకు ఇచ్చాడట. వాటితో వాళ్లు ఏం చేశారో నాకు తెలియదు. జీఎస్టీ శాఖ నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో జంషెడ్‌పూర్‌లోని జీఎస్టీ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాను. నా పేరు మీద ఉన్న కంపెనీ గురించి, దాని లావాదేవీలతో సంబంధం లేదని చెప్పాను. నేను రోజూవారీ కూలీని. పనిచేస్తేనే ఆరోజు నా కడుపు నిండుతుంది. గతేడాదే నా భార్య చనిపోయింది. నా కొడుకుతో కలిసి గుడిసెలో జీవితం వెళ్లదీస్తున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top