ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య
అభ్యంతరం వ్యక్తంచేసిన బీజేపీ
భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న అర్థంలో వాడానన్న ఖర్గే
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్‌లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.
ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు, రాహుల్‌గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.
కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు.
మండిపడిన బీజేపీ
మోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్‌గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.
ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు.


