Maharashtra: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?

Maharashtra Political Crisis: Police On High Alert - Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, తిరుగుబాటు నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం మధ్య రోజరోజుకూ రాజకీయ వివాదం ముదురుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ముంబై పోలీసు కమిషనర్‌ నగరంలో 144 సెక్షన్‌ అమలుచేయడమే గాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంవల్ల ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది.

ఒకపక్క ఉద్దవ్‌ మద్దతుదార్లు, మరోపక్క షిండే వర్గం మద్దతుదార్లు పోటాపోటీగా ర్యాలీలు, ఆందోళనలు, బలప్రదర్శనలు చేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. దీనికితోడు తిరుగుబాటు మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు కేంద్రం భద్రత మరింత పటిష్టం చేయడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి, ఎలాంటి భద్రత కల్పించారో అధ్యయనం చేస్తున్నట్లు పోలీసు శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు తెలిపారు. 
సంబంధిత వార్త: రెబెల్స్‌ ఎమ్మెల్యేలను రప్పించేందుకు సీఎం ఉద్దవ్‌ ఠాక్రే చివరి ప్రయత్నం!

శాంతి భద్రతలపైనే దృష్టి... 
వారం రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు బెడద ఇంతవరకు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఈ వివాదం చట్టపరంగా తేలాలంటే కోర్టుకెక్కే ప్రమాదం ఉంది. ఏదేమైనా షిండే శిబిరంలో తలదాచుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కచ్చితంగా ముంబైకి రావల్సిందే. కేవలం మద్దతుదారులతో కూడిన లేఖ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి పంపిస్తే సరిపోదు. కోశ్యారీ ఎదుట లేదా మంత్రిమండలిలో షిందే తన బలాన్ని నిరూపించాలంటే తన వర్గంలోని ఎమ్మెల్యేందరూ హాజరు కావాల్సిందే. వీరంతా ఒకేసారి ముంబైకి వస్తే శివసైనికులు, ఇతర పార్టీల కార్యకర్తలు వారిపై దాడి చేయడం లేదా వారికి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు కచ్చితంగా చేస్తారు.

అదే సమయంలో శివసైనికులు, షిండే వర్గం కార్యకర్తలు పరస్పరంగా ఎదురుపడితే అప్పుడు పరిస్ధితి ఏంటి.. శాంతి, భద్రతలు కచ్చితంగా అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ఉండాలంటే ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అందుకు ముంబై పోలీసు శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది. ముంబై పోలీసు కమిషనర్‌ సంజయ్‌ పాండే ఇదివరకే రెండుసార్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. తాజా పరిస్ధితులపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడంతో ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగే వాతావరణం కనిపించడం లేదు.
చదవండి: Maharashtra Crisis: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు..

రాజకీయ వివాదం సద్దుమణిగేదాకా ఈ పరిస్ధితి ఇలాగే ఉంటుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుదారులు ముంబైకి వస్తే శాంతి, భద్రతల అంశం తెరమీదకు రానుంది. ముంబైలో పరిస్ధితులు అదుపుతప్పి అల్లర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పాండే నిర్ధేశించినట్లు తెలిసింది. అవసరమైతే అదనంగా వివిధ భద్రతా బలగాలను సమకూర్చునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top