
న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖాడా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు అతని మాజీ శిష్యుల బెదిరింపులు, వేధింపులే కారణమని సీబీఐ పేర్కొంది. మాజీ శిష్యులైన ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో అవమానాలను భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో తెలిపింది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీడియోను బహిర్గతం చేస్తానంటూ ఆనంద్ గిరి తనను బెదిరించినట్లు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు మహంత్ నరేంద్ర గిరి ఆరోపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో తమకు లభ్యమైందని సీబీఐ తెలిపింది. అలహాబాద్‌లోని బడే హనుమాన్ మందిర్ పూజారి ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, సందీప్ తివారీలు మహంత్ బలన్మరణం కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్రలో నిందితులుగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన కోర్టుకు సీబీఐ చార్జిషీటు సమర్పించిందని అధికారులు వెల్లడించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన గదిలో సెప్టెంబర్ 20వ తేదీన మహంత్ గిరి ఉరికి వేలాడుతుండగా గమనించి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.