‘షిందేజీ! సంజయ్‌ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్‌ కోసం ఏం చేయడానికైనా సిద్ధమైనట్లు ఉన్నాడు’

Madhav Singaraju Rayani Dairy: Eknath Shinde On sanjay raut Bail - Sakshi

ఏక్‌నాథ్‌ షిందే(మహారాష్ట్ర సీఎం) రాయని డైరీ

‘‘సంజయ్‌ రౌత్‌ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్‌ కేసర్కర్‌!
ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. 
అప్పుడా సమయంలో చంపాసింగ్‌ థాపా, మోరేశ్వర్‌ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్‌ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. 
ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్‌లను థాపా, రాజేలే లిఫ్ట్‌ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్‌లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. 
‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్‌.

‘‘పర్లేదు చెప్పండి దీపక్‌జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్‌ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్‌ గురించే కాదు, ఉద్ధవ్‌ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. 
‘‘షిందేజీ! సంజయ్‌ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్‌ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్‌ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్‌. 
‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్‌జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. 
‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్‌! 
దీపక్‌ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్‌ మినిస్టర్‌ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. 

‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్‌జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్‌ రౌత్‌ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. 
‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్‌ రౌత్‌ నేరుగా సెంట్రల్‌ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్‌ ముంబైలోని హనుమాన్‌ టెంపుల్‌కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్‌లోని బాల్‌ ఠాక్రే మెమోరియల్‌కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్‌లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్‌. 

‘‘ఆందోళన దేనికి దీపక్‌జీ?!’’ అన్నాను. 
‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్‌తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్‌. 
‘‘అర్థం కాలేదు దీపక్‌జీ..’’ అన్నాను. 

‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్‌దే రియల్‌ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్‌ శివసేన కాదనీ, మీరూ రియల్‌ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్‌! 
చంపాసింగ్‌ థాపా, మోరేశ్వర్‌ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. 
నవంబర్‌ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్‌ శివసేన ఎవరిది కాదో, రియల్‌ సీఎం ఎవరు కారో?!
దీపక్‌ నా వైపే చూస్తూ ఉన్నారు.
‘‘దీపక్‌జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్‌ రౌత్‌ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top