జమ్మూ: శారదా నవరాత్రుల సందర్భంగా జమ్ము కశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశవిదేశాలకు చెందిన పూలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తుండగా, యాత్ర మార్గంలో రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి నవరాత్రులు ప్రారంభం కానుండటంతో జమ్ము, కత్రా ప్రాంతాల్లో సందడి పెరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పూలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించే పనులను తుది దశకు చేరుకున్నాయి. రైలులో నేరుగా కత్రాకు చేరుకోవడానికి భక్తులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ రైళ్లలో సీట్లు పూర్తిగా నిండిపోయాయి. జమ్ములో ఆగే రైళ్లలో వచ్చే భక్తులు అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా కత్రాకు చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపుర్ నుంచి కుటుంబంతో వచ్చిన నాథూలాల్ మాట్లాడుతూ.. నవరాత్రుల సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు ఆధ్వర్యంలో వైష్ణవి భవన్, కాళికా భవన్, సరస్వతి ధామ్‌లలో వసతి ఏర్పాట్లు చేశారు. కాళికా భవన్‌లో అత్యధికంగా 50 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భోజనశాల కూడా ఉంది. కేవలం రూ.90కే సాత్విక భోజనం అందిస్తున్నారు. నవరాత్రుల సమయంలో ఎక్కువ మంది భక్తులు వచ్చినా వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పర్యవేక్షకుడు అశ్విని కోహ్లీ తెలిపారు.
వైష్ణవి ధామ్‌లో 14 ఏసీ గదులతో పాటు మూడు సూట్లు, నాలుగు పడకలతో కూడిన గది సదుపాయం ఉన్నాయి. ఇక్కడ వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన నమోదు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఆధార్ నంబరు నమోదు చేసి ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డును పొందవచ్చు. అదేవిధంగా ప్రసాద కేంద్రం కూడా అందుబాటులో ఉంది. అక్కడ ప్రసాదంతో పాటు కత్రాలోని అమ్మవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన చున్నీలను అందుబాటు ధరలకు విక్రయిస్తున్నారు.
సరస్వతి ధామ్‌లో 200 ఏసీ, 150 నాన్ ఏసీ వసతి గదుల సముదాయం (డార్మిటరీ) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేక గదులు లేవు. నవరాత్రుల సమయంలో ఈ మూడు వసతి కేంద్రాలకు భక్తుల రాక ఒక్కసారిగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌కు బాస్‌లు భారతీయులే.. మస్క్‌కు ఎంపీ ఘాటు సమాధానం!


