బెంగళూరుని ముట్టడిద్దాం

Lay siege to Bengaluru with tractors against farm laws - Sakshi

కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం

రైతు నేత రాకేశ్‌ తికాయత్‌

శివమొగ్గ (కర్ణాటక): కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ తేల్చి చెప్పారు. బెంగళూరుని కూడా ట్రాక్టర్లతో ముట్టడించాలని రైతులకు పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీని ముట్టడించిన మాదిరిగా బెంగళూరుని కూడా నిర్బంధించాలి. మీ ట్రాక్టర్లు తీసుకొని నగరం నలుమూలల నుంచి  రండి’’ అని  అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన మహాపంచాయత్‌లో తికాయత్‌ మాట్లాడుతూ ఢిల్లీలో చేసిన ర్యాలీ మాదిరిగా అందరూ ట్రాక్టర్ల మీదే రండి, నగరంలోని 25 వేల పాయింట్లను బ్లాక్‌ చేస్తూ ఉద్యమించాలని అన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో గత మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, తిక్రి, ఘజియాపూర్‌లలో రైతన్నలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మూడు చట్టాలను వెనక్కి తీసుకొని, కనీస మద్దతు ధరపై చట్టం చేసేదాకా తమ ఉద్యమం ఆగదని అన్నారు. రైతుల్ని వ్యవసాయ కూలీలుగా మార్చే ఈ చట్టాలతో పాటుగా పాలు, విద్యుత్, విత్తనాలు, పురుగుల మందులకు సంబంధించిన చట్టాలు కూడా చేస్తున్నారని, ఇవన్నీ రైతులతో పాటు ప్రజలపై  మోయలేని భారాన్ని వేస్తాయని అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతే భూముల్ని ధారాదత్తం చేయాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో రైతుల భూములన్నింటినీ ఏదో ఒక రకంగా లాగేసుకోవడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాకేశ్‌ తికాయత్‌ ఆరోపించారు. కేంద్రం దిగి రాకపోతే ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాలను ముట్టడిస్తామని చెప్పారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top