లద్దాఖ్‌ పోదాం... పాలపుంతను చూద్దాం! | Ladakh is set to get a unique Dark Sky Reserve | Sakshi
Sakshi News home page

లద్దాఖ్‌ పోదాం... పాలపుంతను చూద్దాం!

Oct 29 2022 5:13 AM | Updated on Oct 29 2022 5:13 AM

Ladakh is set to get a unique Dark Sky Reserve - Sakshi

లద్దాఖ్‌: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్‌ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్‌ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్‌తాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్‌ ఆస్ట్రనామికల్‌ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్‌ క్యాంప్‌ నుంచి కనిపించే అద్భుతమిది.

దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ ముందుకొచ్చింది. లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్‌ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది.

ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్‌ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్‌ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాధాకృష్ణ మాథుర్‌ అక్టోబర్‌ 31న వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement