దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్ష రద్దులు, పునఃపరీక్షల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం ఎదురైన వివాదాల వల్ల నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని తెలిపారు.
దేశంలోని అనేక మంది విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి కోసం భారీగా ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఏడాది ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే అయినా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.


