లేడీ మోడల్స్‌ని అలా చూపించొద్దు: గవర్నర్‌

Kerala Governor Asks Jewellery Brands To Refrain From Presenting Females As Brides In Ads - Sakshi

ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దు

కేరళ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని సూచించారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగు చూడటం పట్ల ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఏడవ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్‌ని  పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల​ జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా కాకుండా వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్‌లో పెళ్లి కుమార్తె ఒంటి నిండ బంగారు ఆభరాణాలు వేసి.. చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంతే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి’’ అని కోరారు.

ఇక కాన్వొకేషన్‌ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వము అని అండర్‌టేకింగ్‌ తీసుకున్నారు ఆరిఫ్‌. అంతేకాక విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం, తీసుకోం అని బాండ్‌ తీసుకోవాలన్నారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు జనాల్లో అవగాహన కూడా రావాలన్నారు ఆరిఫ్‌. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top