తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ను కలిశారు. వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన సతీశన్ కాసేపు మాట్లాడారు.
ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.
మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.
కాగా, వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ‍్యంలో మంత్రివర్గ ఏర్పాట‍్లలో భాగంగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వీడీ సతీశన్ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్‌మెంట్ హౌస్‌లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.
కాగా, కేరళలో యూడీఎఫ్ గెలిచాక కేసీ వేణుగోపాల్ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్‌కు హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल से केरल के मनोनीत मुख्यमंत्री वीडी सतीशन ने आज मुलाकात की pic.twitter.com/yBHDCsjulZ
— News Capsule (@newscapsule_) May 16, 2026


