రాజాకీయాలు అంటే మురికిగుంట : కమల్‌ హాసన్‌

Kamal Haasan Talk About Sanitary Workers In Election Campaign - Sakshi

వేళచ్చేరిలో కమల్‌ వ్యాఖ్య

సాక్షి, చెన్నై: తనతో పాటు మక్కల్‌ నీది మయ్యంలోని ప్రతి ఒక్కరం పారిశుధ్య కార్మికులం అని, రాజకీయాల్లోని మురికిని కడిగేందుకే రంగంలోకి దిగినట్టు పార్టీ నేత కమలహాసన్‌ తెలిపారు. మంగళవారం చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న మక్కల్‌ నీది మయ్యం అభ్యర్థి, ఐఏఎస్‌ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్‌ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఓటర్లతో మాట్లాడారు.  

రాజకీయాల్లో మురికిని కడిగేందుకే వచ్చా 
రాజకీయాలు అంటే మురికిగుంట అని పెద్దలు చెప్పే వారని గుర్తుచేశారు. అందుకే అనేక మంది చదువుకున్న పెద్దలు ఈ మురికిగుంటలో దిగేందుకు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. రాజకీయాలను అసహ్యించుకున్నారని తెలిపారు. ఈ మురికి అలాగే వదలివేయడంతో మరింత దుర్వాసన భరితంగా రాజకీయాలు మారినట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గుంటను ఎవరో ఒకరు శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించే తాను రంగంలోకి దిగినట్టు తెలిపారు. రాజకీయం అనే మురికిగుంటను శుభ్రం చేయడానికి తనతో పాటు మక్కల్‌ నీది మయ్యం వర్గాలు అందరూ పారిశుధ్యకార్మికులుగా మారామని అన్నారు. రాజకీయం అనే మురికిని ఇకనైనా శుభ్రం చేయకుంటే, భావితరాలు ఈ తరం వారిని దుమ్మెత్తిపోస్తాయని పేర్కొన్నారు. జనం హితాన్ని కాంక్షించేందుకు వచ్చిన ఈ పారిశుధ్యకార్మికుల్ని ఆదరించాలని విన్నవించారు.

తమను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ఇరకాటంలో పెట్టే పరిస్థితుల్ని కల్పిస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, తమకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కమల్‌ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో మంగళవారం నటి సుహాసిని సుడిగాలి ప్రచారం చేశారు. అవినీతిశక్తులకు వ్యతిరేకంగా కమల్‌ ఉద్యమిస్తున్నారని, ఆ శక్తుల్ని అంతం చేయడానికి మక్కల్‌ నీది మయ్యంకు అండగా, మద్దతుగా ఓట్లు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 
చదవండి: రైల్వేశాఖ కీలక నిర్ణయం: రైళ్లలో సెల్‌ ఛార్జింగ్‌ బంద్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top