జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ పరీక్షలకు బ్రేక్‌

Johnson And Johnson Pauses Covid Vaccine Trial - Sakshi

వాలంటీర్‌కు అస్వస్థత

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిరోధానికి పలు ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కీలక దశకు చేరాయి. వ్యాక్సిన్‌ పరీక్షలు ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

తాము నిర్వహించిన అథ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వ్యక్తి వివరించలేని అస్వస్థతకు లోనవడంతో తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.

ఏ క్లినికల్‌ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అథ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటన(ఎస్‌ఏఈ)లు ఊహించదగినవేనని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. అథ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్‌ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అమెరికాతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, దక్షిణాఫ్రికాలో క్లినకల్‌ ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. చదవండి : ‘వ్యాక్సిన్ ఇలా ఇస్తే ‌అద్భుత ఫలితాలు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top