అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్య
వాడీవేడీగా కొనసాగిన అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరినీ కష్టాలకడలిలో ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ఇకనైనా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ హితబోధ చేశారని అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. యుద్ధం మరింత విస్తరించకుండా భారత్ తన వంతుగా ఎలాంటి కృషిచేయట్లేదన్న విపక్షాల ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది.
పాకిస్తాన్‌లా భారత్ దళారీగా వ్యవహరించబోదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టలు పెదవి విరిచాయి. ఈ అఖిలపక్ష భేటీకి బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్ వేదికగా నిలిచింది. బుధవారం సాయంత్రం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో మొదలైన ఈ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్‌షా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు పాల్గొన్నారు.
విపక్షాల నుంచి తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్(కాంగ్రెస్), ధరేంద్ర యాదవ్(ఎస్పీ), సస్మిత్ పాత్రా(బీజేడీ), సంజయ్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ షిండే(శివసేన), సంజయ్‌సింగ్(ఆప్), జాన్ బ్రిటాస్ (సీపీఎం), సుప్రియా సూలే(ఎన్సీపీ–ఎస్పీ), అరవింద్ సావంత్(శివసేన–యూబీటీ), అసదుద్దీన్ ఒవైసీ(ఏఐఎంఐఎం) తదితర నేతలు పాల్గొని దాదాపు రెండు గంటలపాటు పశ్చిమాసియా అంశంపై చర్చించారు.
యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనకన్నా చిన్నదేశం పాకిస్తాన్ ముందుకొచ్చిందని, భారత్ కనీసం నోరుమెదపలేదని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘దళారిలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులుచాచడం పాకిస్తాన్‌కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్‌ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్‌లా భారత్ దళారీ దేశం కాదు.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎప్పుడూ జోక్యంచేసుకోదు. మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్ తన వంతు కృషిచేస్తోంది. మౌనంగా కూర్చోలేదు. సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తున్నాం. ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ మరణవార్త తెలియగానే మోదీ సర్కార్ స్పందించలేదన్న విపక్షాల వాదనల్లో నిజం లేదు. ఇరాన్ ఎంబసీని తెరచిన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాపం తెలిపారు. అక్కడి సంతాపసూచిక పుస్తకంలో సంతకం కూడా చేసి వచ్చారు’’అని అన్నారు.
మన వాళ్ల భద్రత, ఇంధన భద్రత ముఖ్యం
‘‘గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యం. దీంతోపాటే దేశీయ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చడం పైనా మేం దృష్టిసారించాం. ఈ విషయంలో దౌత్య విజయం సాధించాం. భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్‌జీ నిల్వలపై ఆందోళన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ముడిచమురు, ఇంధన నౌకలు విదేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. మరిన్ని నౌకలు మార్గమధ్యంలో ఉన్నాయి. హార్మూజ్ గుండా రావాల్సిన 18 నౌకలు అక్కడే చిక్కుకుపోయిన మాట వాస్తవమే. హార్మూజ్ గుండా సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టిసారించాం. ముడి చమురు, గ్యాస్‌లను వేరే దేశాల నుంచి తెప్పిస్తున్నాం.
భారత్ కేవలం గల్ఫ్‌దేశాల నుంచేకాకుండా మొత్తంగా 41 దేశాల నుంచి ఆయిల్, గ్యాస్‌లను కొనుగోలుచేస్తోంది. మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇజ్రాయెల్ అతిపెద్ద సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి. మనకు ఇరాన్‌తోనూ సత్సంబంధాలున్నాయి’’అని ప్రభుత్వం విపక్షాలకు తెలియజేసింది. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై తక్షణం 193వ నిబంధన కింద లోక్‌సభలో, 176వ నిబంధన కింద రాజ్యసభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. మరోవైపు విపక్షనేత రాహుల్‌గాంధీ అఖిలపక్ష భేటీకి రాకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.


