భారత విద్యార్థిపై అమెరికా అరాచకం.. వీడియో వైరల్‌ | Indian Student Kunal Jain Handcuffed And Pinned To Floor Sparks Outrage At US Airport | Sakshi
Sakshi News home page

భారత విద్యార్థిపై అమెరికా అరాచకం.. వీడియో వైరల్‌

Jun 11 2025 7:59 AM | Updated on Jun 11 2025 10:07 AM

Indian Student Kunal Jain Sparks Outrage US Airport

న్యూఢిల్లీ: భారత విద్యార్థిని నేలపై పడేసి, పెడరెక్కలు వెనక్కు విరిచి కట్టి బేడీలు వేయడాన్ని అమెరికా సమర్థించుకుంది. ‘‘అతనిపై అలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను, వీసా ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు’’ అని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాకపోతే బాధిత విద్యార్థి ఎటువంటి వీసా ఉల్లంఘనకు పాల్పడిందీ వివరించలేదు.

శనివారం రాత్రి భారత్‌కు తిప్పి పంపించే క్రమంలో సదరు విద్యార్థి పట్ల నెవార్క్‌ విమానాశ్రయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అత్యంత అనుమాషంగా వ్యవహరించడం తెలిసిందే. తాను నేరగాన్ని కాదని బాధితుడు అరుస్తున్నా పట్టించుకోలేదు. కునాల్‌ జైన్‌ అనే ప్రవాస భారతీయుడు దీన్నంతటినీ వీడియో తీసి ఎక్స్‌లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిస్సహాయుడైన ఒక అమాయకున్ని కరడుగట్టిన నేరస్తునిలా చూశారంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అమెరికా మాత్రం సమర్థించుకోవడం గమనార్హం.

‘‘చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతాం. కానీ ఎవరికైనా సరే, మా దేశంలోకి ప్రవేశం ఒక హక్కు కాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ దౌత్య కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఉదంతంపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ స్పందించింది. ‘‘దీనికి సంబంధించిన సోషల్‌ మీడియా పోస్టులను చూశాం. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాం’’ అని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. భారతీయుల సంక్షేమానికి కాన్సులేట్‌ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్‌ సర్కారు కొన్నాళ్లుగా కొరడా ఝళిపిస్తుండటం తెలిసిందే. ట్రాఫిక్‌ ఉ ల్లంఘనల వంటి చిన్నాచితకా కారణాలకు కూడా కనీసం ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపించేస్తోంది. వీటిపై అక్కడి కోర్టులో న్యాయ పోరాటాలు కూడా సాగుతున్నాయి.

ట్రంప్‌తో మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్‌ 
ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. భారత విద్యార్థులపై అమెరికాలో నిర్బంధం నానాటికీ పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై భారత్, భారతీయుల గౌరవ మర్యాదలను కాపాడటంతో మోదీ ప్రభుత్వం వరుసగా విఫలమవుతూ వస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి. తక్షణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడి వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టించాలి’’ అని డిమాండ్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement