
భువనేశ్వర్: బాలాసోర్‌లో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శితో సహా ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని నిప్పంటించుకున్నప్పుడు ఏబీవీపీ నాయకుడు సుభత్ సందీప్ నాయక్, జ్యోతి ప్రకాష్ బిస్వాల్ అక్కడే ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు.
తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమావేశంలో విద్యార్థినిపై ఒత్తిడి చేశారు. అంతేకాదు.. యువతిపైనే చర్యలు తీసుకోవాలంటూ కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి నిందితుడు సాహూ విద్యార్థుల బృందాన్ని సమీకరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ సాహూను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు పురికొలి్పన ఇద్దరు ఏబీవీపీ నేతలను ఇటీవల అరెస్టు చేశారు.
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ చదువుతున్న 20 ఏళ్ల యువతి.. డిపార్ట్‌మెంట్ హెడ్ సమీర్ కుమార్ సాహూ తనను లైంగికంగా వేధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది పెద్దగా పురోగతి సాధించలేదు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసిన ఆమె.. కొద్దిసేపటికే క్యాంపస్‌లోనే నిప్పంటించుకుంది.
ఆమెను మొదట బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, తరువాత ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె ప్రాణాలతో పోరాడింది. పరిస్థితి విషమించడంతో జూలై 14న మరణించింది. వేధింపుల కారణంగా యువతి బాధపడుతోందని తోటి విద్యార్థులు తెలిపారు. సాహూ అనుచిత డిమాండ్లు చేసేవాడని, అంగీకరించకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడన్నారు.