breaking news
Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)
-
ఒడిశా విద్యార్థి ఆత్మహత్య కేసులో ఏబీవీపీ నేత సహా ఇద్దరు అరెస్టు
భువనేశ్వర్: బాలాసోర్‌లో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శితో సహా ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని నిప్పంటించుకున్నప్పుడు ఏబీవీపీ నాయకుడు సుభత్ సందీప్ నాయక్, జ్యోతి ప్రకాష్ బిస్వాల్ అక్కడే ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమావేశంలో విద్యార్థినిపై ఒత్తిడి చేశారు. అంతేకాదు.. యువతిపైనే చర్యలు తీసుకోవాలంటూ కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి నిందితుడు సాహూ విద్యార్థుల బృందాన్ని సమీకరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్, హెచ్ఓడీ సాహూను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు పురికొలి్పన ఇద్దరు ఏబీవీపీ నేతలను ఇటీవల అరెస్టు చేశారు. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ చదువుతున్న 20 ఏళ్ల యువతి.. డిపార్ట్మెంట్ హెడ్ సమీర్ కుమార్ సాహూ తనను లైంగికంగా వేధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది పెద్దగా పురోగతి సాధించలేదు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసిన ఆమె.. కొద్దిసేపటికే క్యాంపస్‌లోనే నిప్పంటించుకుంది. ఆమెను మొదట బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, తరువాత ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె ప్రాణాలతో పోరాడింది. పరిస్థితి విషమించడంతో జూలై 14న మరణించింది. వేధింపుల కారణంగా యువతి బాధపడుతోందని తోటి విద్యార్థులు తెలిపారు. సాహూ అనుచిత డిమాండ్లు చేసేవాడని, అంగీకరించకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడన్నారు. -
నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలి
కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను రాష్ట్ర నూతన మంత్రివర్గం నుంచి తొలగించాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి సునిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్పొరేట్ విద్యావ్యవస్థకు మరింత ఆయువు పోసినట్లవుతుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు పెరిగిపోయాయని, దీని కారణంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని వివరించారు. ఎంసెట్, ఇంటర్ వార్షిక ప్రశ్నాపత్రాల లీకేజీలలో నారాయణ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్యకుమార్, నగర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, నగర సంఘటనా కార్యదర్శి రంజిత్, రాజేష్, సుభాకర్, సాయి, జనార్ధన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుల అరెస్టు, విడుదల... ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు సునిల్‌రెడ్డి, సూర్యకుమార్, ప్రశాంత్, రంజిత్, రాజేష్, జనార్దన్, శివ, సతీష్, నంద, ప్రతాప్, సందీప్‌ను పోలీసులు అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట 144వ సెక్షన్ అమలులో ఉందని, ధర్నాలు చేయరాదని పోలీసులు చెప్పారని సునిల్‌రెడ్డి వివరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.