
సముద్రమట్టానికి 15వేల అడుగుల ఎత్తులో పరీక్ష
న్యూఢిల్లీ: భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లద్దాఖ్‌లో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సహకారంతో లద్దాఖ్ సెక్టార్‌లో ఈ ప్రయోగపరీక్షలు పూర్తయ్యాయి.
గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో చేధించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్‌లో ఈ కొత్త ఆకాశ్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుని ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకుంది. ఆనాడు పాకిస్తాన్‌కు చైనా తయారీ యుద్ధవిమానాలు, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆకాశ్ ప్రైమ్ క్షిపణులు తప్పించాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.