కేరళను వీడని వర్షాలు

India Meteorological Department issues orange alert for parts of Kerala amid heavy rains - Sakshi

8 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌  

తిరువనంతపురం/డెహ్రాడూన్‌: కేరళలో పలుప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం సైతం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు బెంబేలెత్తించాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పత్తనంథిట్ట, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకుళం, త్రిసూర్, కాసర్‌గోడ్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

24 గంటల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉంటే రెడ్‌అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకాకురిసే పరిస్థి తి ఉంటే ఆరెంజ్‌ అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తారు. కేరళలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని (ఉపసంహర ణ దశలో), అందుకే కేరళతోపాటు లక్షదీ్వప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంపైకి వెళ్లొద్దని సూచించింది. కేరళలో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటిదాకా 42 మంది మృతి చెందారు. ఆరుగురు కనిపించకుండా పోయారు.  

ఉత్తరాఖండ్‌లో వరద నష్టం 7 వేల కోట్లు!  
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జల విలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ.7,000 కోట్ల నష్టం వాటిలినట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఏరియల్‌ సర్వే అనంతరం జోలీగ్రాంట్‌ ఎయిర్‌పోర్టులో అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చురుగ్గా స్పందించడంతో వరదల నష్టాన్ని చాలావరకు నివారించగలిగామని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 65 మంది మరణించడం, 11 మంది కనిపించకుండా పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్ర పునఃప్రారంభం
భారీ వర్షాల కారణంగా 18న తాత్కాలికంగా నిలిపివేసిన చార్‌ధామ్‌ యాత్ర మళ్లీ ప్రారంభమయ్యింది. రిషికేశ్‌ చార్‌ధామ్‌ బస్‌ , హరిద్వార్‌ బస్టాండ్‌ నుంచి భక్తులు చార్‌ధామ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అధికారులు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌ సర్వీసులను పునరుద్ధరించారు. చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top