
భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో ఎప్పుడైనా (భవిష్యత్తులో) ఉగ్రదాడులు జరిగినా.. వారికి మద్దతుగా నిలిచినా, దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. చర్యకు, ప్రతిచర్య గట్టిగానే ఉంటుందని హెచ్చరించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. కాగా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.
పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. భారత్.. పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పరిణామాల గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు.