పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం | Indian Govt Banned Pakistan YouTube Channels | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం

Apr 28 2025 10:29 AM | Updated on Apr 28 2025 12:11 PM

Indian Govt Banned Pakistan YouTube Channels

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్‌ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ ట్విట్టర్‌, సినిమాలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.

ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement