
అదేపనిగా పని చేస్తుంటే ‘మానసిక అలసట’
అవసరాన్ని వదిలి, అనవసరం వైపు దృష్టి
‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో వెల్లడి
గంటల తరబడి కూర్చొని చేసే పని వల్ల కూడా అలసిపోతాం. ఈ అలసటనే వైద్య పరిభాషలో ‘కాగ్నటివ్ ఫెటీగ్’ (మానసిక అలసట) అంటారు. ఇలాంటి అలసట.. ఉపయోగకరమైన పనులకన్నా.. అంతగా ప్రయోజనం లేని సులభమైన పనులను ఎంచుకునేలా మన మెదడును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దైనందిన నిర్ణయాలను నిష్ప్రయోజనమైన పనుల వైపు దారి మళ్లించే ఈ మానసిక అలసటను.. సుదీర్ఘమైన పనులు చేసేటప్పుడు విరామాలు తీసుకోవటం ద్వారా నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఆఫీసు నుంచో లేదా బయట పని పూర్తిచేసుకునో ఇంటికి వచ్చాక.. అందరూ చేసేది కుర్చీలోనో మంచం మీదనో కాసేపు అలా నడుం వాల్చడం. అలాంటప్పుడు మరో ముఖ్యమైన పని చేయాలన్నా ఆలోచిస్తాం. కానీ, ఫోన్‌లో ఏవైనా సరదా అంశాలు లేదా టీవీలో ఏదైనా ప్రోగ్రామో చూడటం మాత్రం మనకు కష్టంగా అనిపించదు. ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో తాజాగా అచ్చయిన అధ్యయన వివరాలను బట్టి – తక్కువ ప్రయోజనాలను అందిస్తున్నవే అయినప్పటికీ, మనం ఇలా సులభమైన పనులనే ఎంచుకోవటానికి ప్రధాన కారణం.. ‘మానసిక అలసట’.
తక్కువ లాభం.. ఎక్కువ లాభం!
కష్టమైన పని, తేలికైన పని జట్లలోని వారిని.. వాళ్ల పని అనంతరం, ఎంపిక చేసుకోటానికి మళ్లీ రెండు రకాల పనులు ఇచ్చారు.
1. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పని.
2. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పని.
⇒ మానసికంగా అలసిపోయిన వారు.. తక్కువ డబ్బు వచ్చే సులభమైన పనిని ఎంచుకున్నారు.
⇒ మానసికంగా అలసిపోని వారు.. ఎక్కువ డబ్బు వచ్చే కష్టమైన పనిని ఎంపిక చేసుకున్నారు.
ఎవరికి తేలికైనవి వారు
ప్రతి ఒక్కరికీ పని చేయడానికి వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. ఒకరికి సులభంగా ఉండేది, మరొకరికి కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఎవరికి వారు ‘మానసిక అలసట’ తర్వాత తమకు సులభంగా ఉండే పనులను మాత్రమే ఎంచుకుంటారని ఈ అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడు, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన విక్రమ్ చిబ్ అంటున్నారు. మానసిక అలసట మన దైనందిన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించడానికి ఈ అధ్యయనం ఒక నమూనాను రూపొందించింది.
తేలికైన, కష్టమైన పనులు
అధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యవంతులైన కొందరిని ఎంపిక చేసి, వారిని నిరంతర జ్ఞాపకశక్తి అవసరమైన పనిలో నియమించారు. ఒక స్క్రీన్‌పైన ఒకటి తర్వాత ఒకటిగా మెరుస్తున్న వేర్వేరు అక్షరాలపై దృష్టి పెట్టమని కోరారు. ఆ పనిని పరిశోధకులు ‘తేలికైన పని’, ‘కష్టమైన పని’ అని విభజించారు. తేలికైన పనిలో భాగంగా స్క్రీన్‌పైన మారుతున్న అక్షరాలలో అప్పటికి కనిపిస్తున్న అక్షరం, ఆ ముందు వచ్చి వెళ్లిన అక్షరంతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి.
ఇక కష్టమైన పనిలో.. అప్పటికి వారు చూస్తున్న అక్షరం, ఆ ముందు చూసిన రెండు నుండి ఆరు అక్షరాల మధ్య స్క్రీన్‌పైకి వచ్చి వెళ్లిన అక్షరాలతో సరిపోలి ఉందో లేదో గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోగంలో – కష్టమైన రెండో పనిని వరుసగా చేసినవారు తాము మానసికంగా చాలా అలసిపోయినట్లు తెలిపారు. తేలికైన పని చేసినవారిలో అలసట కనిపించలేదు.
ఫంక్షనల్ ఎమ్మారై పట్టేసింది
అధ్యయనంలో పాల్గొన్నవారు తమ పనులను ఎంపిక చేసుకుంటుండగా, పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్–ఎంఆర్‌ఐ)ను ఉపయోగించి వారి మెదడులోని రసాయన చర్యల్ని నమోదు చేశారు. శరీరంలోకి పరికరాలను చొప్పించే అవసరం లేని ఈ ‘నాన్–ఇన్వేసివ్ టెక్నిక్’తో.. వాళ్లు ఒక పని చేస్తున్న సమయంలో మెదడులో చురుగ్గా ఉన్న ప్రాంతాలను గుర్తించారు.
మానసికంగా అలసిపోయిన వారిలో – నుదుటి వెనుక ఉండే ‘డోర్సోలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ ఏరియా క్రియాశీలం అవటాన్ని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, మానసిక అలసట తర్వాత పనులను, ఎంపికలను నిర్ణయించుకున్నప్పుడు మెదడులోని ‘రైట్ యాంటీరియర్ ఇన్సులా’ (ఇన్సులా) అనే ప్రదేశం క్రియాత్మకం అయి కనిపించింది. ఈ ప్రదేశం, ఒక పనిని ‘అది ప్రతిఫలానికి తగిన పనేనా?’ అనే దాన్ని నిర్ణయిస్తుంది.
పనితీరు సామర్థ్యం తగ్గలేదు..
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఒకదాని తర్వాత ఒకటి కష్టతరమైన పనులను చేస్తున్నప్పుడు తాము అలసిపోయినట్లు చెప్పినప్పటికీ వారి పనితీరు సామర్థ్యం కొంచెమైనా తగ్గలేదు. అంటే.. మానసిక అలసట అనేది పని అనంతరం విశ్రాంతినిచ్చే పనులను ఎంపిక చేసుకుంటున్నదే కానీ, అలసట కలిగిస్తున్న పనిని ఒళ్లు దాచుకోకుండా చేయటానికి మాత్రం అడ్డపడటం లేదన్నమాట.
విరామాలతోనే నివారణ
⇒ మన దైనందిన నిర్ణయాలను ప్రభావితం చేసే ఈ మానసిక అలసటనునివారించేందుకు ఒకే ఒక్క మార్గం.. కూర్చొని చేసే సుదీర్ఘమైన పనుల్లో తరచూ విరామాలు తీసుకుంటూ ఉండటమే అంటున్నారు డాక్టర్ చిబ్.
⇒ అనేక నాడీ సంబంధిత, మానసిక పరిస్థితులలో మానసిక అలసట అనేది ఒక సాధారణ లక్షణం అని పరిశోధకులు చెబుతున్నారు.
⇒ స్ట్రోక్ వచ్చినవారిలో, మల్టిపుల్ స్కె›్లరోసిస్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, ఒత్తిడి, ఆందోళన, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మానసిక అలసట ఉన్నట్లు కూడా తాజా అధ్యయనం కనుగొంది.
⇒ ‘ప్రయత్నించటం’, ‘నిర్ణయం తీసుకోవటం’ అనే వాటిని మెదడు ఏ విధంగా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అధ్యయనవేత్తలు భావిస్తున్నారు.